సిద్దిపేట, డిసెంబర్ 25( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘అనాథ పిల్లలకు అన్నం పెట్టలేని రేవంత్‌రెడ్డి.. ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అలాంటి రేవంత్‌రెడ్డిని చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి తొండలు జొర్రించినా తకువే. ఆయన మళ్లీ గెలుస్తా అని శపథాలు చేస్తున్నడు, కమీషన్లు కొట్టుడు, చిల్లర మాటలు మాట్లాడుడు, పార్టీలు మారుడు, సీట్లు కొనుడు రేవంత్‌కు అలవాటైంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్‌పురా ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ సూల్లో విద్యార్థులకు హరీశ్‌రావు గురువారం బ్లాంకెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు పెట్టే గుడ్లు, బియ్యం పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. క్యాంప్ కార్యాలయలంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు క్రిస్మస్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆయా చోట్ల హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై, ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు పాత బియ్యం పంపిణీ చేసి, నాణ్యమైన భోజనం పెట్టిందని హరీశ్‌రావు గుర్తుచేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న బియ్యంతో అన్నం మెత్తగా, ముద్దలుగా అవుతుందని హాస్టల్ నిర్వాహకులు తనకు చెప్పినట్టు తెలిపారు. హైదరాబాద్ కాలుష్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే కాలుష్య పరిశ్రమలను తరలించడానికి తాము జీరో లిక్విడ్ బేస్తోని ఫార్మాసిటీనీ ఏర్పాటు చేశామని తెలిపారు. దానికి ఎన్విరాన్మెంట్ క్ల్లియరెన్స్ను తమ ప్రభుత్వమే తీసుకొచ్చిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని విమర్శించారు. ‘ఆనాడు నువ్వే కదా అక్కడికి పోయి ఈ ఫార్మాసిటీ వద్దు.. భూములు తిరిగిస్తా అని చెప్పింది. మరి నీది నోరా? మోరీనా? అని ప్రశ్నించారు. రైతుల భూములను వారికే తిరిగి ఇవ్వు, లేదా కేసీఆర్ ఆలోచన ప్రకారం ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాంటిది ఏదీ చేయకుండా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావని రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. కేసీఆర్ అడిగిన దాంట్లో ఏమైనా తప్పున్నదా? ఫార్మాసిటీ పెట్టనిది నిజం.. రైతులకు భూములు ఇవ్వనిది నిజం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకన్నా నిజం అని స్పష్టంచేశారు.
తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను అంతంత మాటలంటవా? ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియదా నీకు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలేమిటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేమిటి? రాష్ర్టానికి సంబంధించిన అత్యంత ప్రధానమైన సమస్యను కేసీఆర్ లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పు. అంతే కానీ ఇష్టమొచ్చినట్టు నోరు ఉన్నది కదా అని మాట్లాడితే ఇక్కడ ఎవరూ ఊరుకోరు.
చిల్లర మాటలు కాదు.. బడి పిల్లలకు బుక్కెడు అన్నం పెట్టే తెలివి లేదా? అని సీఎం రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఏనాడైనా బడి పిల్లలతో మాట్లాడావా? మాట్లాడితేనే వారి సమస్యలు తెలుస్తాయని చెప్పారు. అనాథ పిల్లలైన వీరు క్రిస్మస్ పండుగ రోజు పస్తులున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీరు చలితో చాలా ఇబ్బందుల్లో ఉన్నారని బ్లాంకెట్లు పంపిణీ చేశామని చెప్పారు. పిల్లలకు 5 నెలల నుంచి విద్యార్థులకు మెస్ బిల్లులు, కాస్మెటిక్ చార్జీలు రావడమే లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఇచ్చే బిల్లులు విడుదల కావడమే లేదని ఆరోపించారు. వీరు కమీషన్ ఇవ్వరు కదా అందుకే విద్యార్థుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
‘హాస్టల్, గురుకులాల బాట పట్టి పిల్లల ఇ బ్బందులను ప్రభుత్వం దృష్టికి తెస్తే గ్రీన్ చానల్ ద్వారా బిల్లులు చెల్లిస్తానన్నావు కదా. పైసలు పడకపోతే తోలు తీస్తా.. తోడ్కలు తీస్తా.. అని అన్నవు. ఇవ్వాళ మరి ఎవరి తోలు తియ్యాలి, ఎవరి తోడ్కలు తియ్యాలి’ అని రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. నువ్వే కదా విద్యాశాఖ మంత్రివి, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రివి.. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, కస్తుర్బా పాఠశాలల పెండింగ్ బిల్లులు, కాస్మెటిక్ చార్జీలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర సాధకుడు కేసీఆర్ అయితే.. వీధిరౌడీలాగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నడు. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్.. ఆయనే లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు. తండ్రి లాంటి కేసీఆర్‌ను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం సీఎం రేవంత్‌రెడ్డికి సరికాదు.
– హరీశ్‌రావు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో క్రిస్మస్ పర్వదినానికి విశేష ప్రాధాన్యమిచ్చారని హరీశ్‌రా వు గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిస్మస్ సందర్భంగా ఏటా రెండు రోజులపాటు సెలవులిచ్చామని తెలిపారు. క్రిస్మస్ కిట్టు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాను కేసీఆర్ అందించారని గుర్తుచేశారు. రేవంత్ క్రిస్మస్ను మరచిపోయాడని విమర్శించారు.