Mid day Meal | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఒక ‘టీ’ విలువ 7 నుంచి 10 రూపాయలు. ఒక టీ విలువతో భోజనం వస్తుందా? అంటే అనుమానమే. కానీ ఒక టీ విలువైన మొత్తంతో మధ్యా హ్న భోజనం అమలవుతున్నది. దీంతో నాణ్యత ప్ర శ్నార్థకంగా మారింది. ఈ పథకంలో భాగంగా ప్రాథమిక తరగతుల్లోని వారికి రూ.ఆరు, ఉన్నత పాఠశాలల్లోని వారికి రూ. తొమ్మిది మత్రమే అందిస్తున్నా రు. ఈ ధర గిట్టుబాటు కాక కుళ్లిన కూరగాయలు, కుళ్లిన కోడిగుడ్లను వినియోగించడంతో మధ్యాహ్న భోజనం వికటిస్తున్నది. నారాయణపేట జిల్లా మాగనూరులో ఫుడ్పాయిజన్కు కుళ్లిన కోడిగుడ్లను వినియోగించడమే కారణంగా తేలింది. అనేక చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ధరల ను పెంచితే నాణ్యమైన భోజనాన్ని అందించే వీలుంటుందని ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నాయి. కేంద్రం వాటాగా 60శాతం, రాష్ట్రవాటాగా 40శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే కావాలనుకుంటే రాష్ట్ర వాటాను పెంచి నాణ్యమైన ఆహారాన్ని అందించే వీలుంటుందని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. కానీ ఆ దిశగా రేవంత్ సర్కారు దృష్టి సారించడం లేదు. ఇటీవలే హాస్టళ్లల్లోని విద్యార్థుల మెస్, కాస్మెటిక్ చార్జీలను పెంచిన ప్రభుత్వం మ ధ్యాహ్న భోజన చార్జీలను మాత్రం పెంచలేదు. ఇది వరకు ప్రాథమిక స్కూళ్లల్లో ఒక పూట భోజనానికి రూ.5.45, హైస్కూళ్లల్లో ఒకపూటకు రూ. 8.17 చొప్పున అందజేస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం పెంచింది. ప్రాథమిక తరగతులకు రూ. 6.19, హైస్కూళ్లల్లో రూ.9.26కు పెంచారు. పెంచిన ధరలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది.
మెనూ ప్రకారం రోజూ రెండు కూరలు పెట్టాల్సి ఉండ గా, ఏస్కూళ్లో రెండు కూరలు పెట్టడంలేదు. ఇటీవలీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతాపసింగారం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. అయితే రెండు కూరలు ఎందుకు పెట్టడంలేదని ఆరా తీయ గా పప్పులోనే కూరగాయలను కలిపేశామని నిర్వాహకులు చెప్పారు. ఇక వారానికి 3 కోడిగుడ్లు పెట్టా ల్సి ఉండగా, కొన్నింటిలో అస్సలు ఇవ్వడం లేదు. మరికొన్ని స్కూళ్లల్లో వారానికి ఒకటి రెండు మాత్ర మే ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్లో గడ్డు ధర రూ. ఏడు ఉండగా, ప్రభుత్వం ఒక గుడ్డుకు రూ. ఐదు మాత్రమే అందిస్తున్నది. భోజన నాణ్యత, రెండు కూరలు, కోడిగుడ్లపై హెచ్ఎంలు, టీచర్లు ప్రశ్నిస్తే ఏజెన్సీలు ఎదురుతిరుగుతున్నట్టు టీచర్లు వాపోతున్నారు. మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి.
రాష్ట్రంలో సర్కారు స్కూళ్లల్లోని విద్యార్థుల్లో 32శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తినడం లేదు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు విముఖత చూపుతున్నారు. ఇంటినుంచి టిఫిన్బాక్స్లు తెచ్చుకుని కడుపునింపుకుంటున్నారు. ఇక ఇటీవలీ కాలంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీంతో మధ్యాహ్న భోజనం తినే వారి సంఖ్య మరింత పడిపోనుంది. ఇక రాష్ట్రంలో 27,008 స్కూళ్లుండగా, ఇప్పటి వరకు 3,985 స్కూళ్లకు (15శాతం) మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లున్నాయి. మిగతా బడుల్లో కట్టెల పొయ్యిలమీదే వంట చేస్తున్నారు. చెట్ల కింద వంటచేయడంతో చెట్టమీదున్న పురుగులు అన్నం, కూరల్లో పడుతున్నట్టుగా క్షేత్రస్థాయి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.