హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదికను యథాతథంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలముందు ఉంచలేదు. మొత్తం 665 పేజీల పూర్తి నివేదికకుగాను కేవలం 60 పేజీలను మాత్రమే రేవంత్‌రెడ్డి సర్కారు మంగళవారం విడుదల చేసింది. అంటే పదోవంతు కూడా కాదు. మొత్తం నివేదిక నుంచి ఎంపిక చేసిన పేరాలను, సెలెక్టెడ్ అభిప్రాయాలను అందులో పొందుపర్చింది. తన కమిషన్ నివేదికను తానే పూర్తిగా ప్రజల ముందు ఉంచకపోవడం, పబ్లిక్ డొమైన్లో పెట్టే అవకాశమున్నా పెట్టకుండా ఉండటం అనుమానాలకు తావిస్తున్నది.
నివేదికలోంచి తనకు అనుకూలంగా ఉన్న అంశాలనే మీడియాకు రిలీజ్ చేయడం గమనార్హం. కాళేశ్వరంలో అసంబద్ధ నిర్ణయాలు, అనుమతులతోపాటు.. కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పాత్ర పోషించారన్న కమిషన్ రాజకీయ వ్యాఖ్యలనూ అందులో పొందుపర్చారు. విచిత్రంగా అప్పుడు కాళేశ్వరం పనులను పర్యవేక్షించిన, బిల్లులపై స్వయంగా సంతకాలు చేసిన అధికారులలో తమకు అనుకూలురైన కొందరి పేర్లను నివేదిక నుంచి తొలగిచినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
అనుకూల మీడియాకు లీకులు
గత నెల 31న కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అయితే ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శికి సీల్డ్ కవర్లో అందజేసిన నివేదిక.. విచిత్రంగా ప్రభుత్వ అనుకూల మీడియాకు ముందే చేరిపోయింది. గంటల వ్యవధిలోనే ఆగస్టు 1నాటి సంచికల్లో ‘సీల్డ్‌కవర్’ నివేదికలో ఏమున్నదో వచ్చేసింది. ఆ తర్వాత మూడురోజులుగా కమిషన్ రిపోర్టులోని విషయాలను పూసగుచ్చుతూ ప్రభుత్వ అనుకూల పత్రికలు పలు కథనాలను వండివార్చాయి. అంటే సీల్డ్‌కవర్ నివేదికను బయటి వ్యక్తులతో, అనుకూల మీడియాతో బాధ్యులే పంచుకున్నట్టు అర్థమవుతున్నది.
నివేదికను బయట పెట్టడానికి ముందే ప్రజల మైండ్‌లో తమకు అనుకూలంగా ఉన్న విషయాలను చొప్పించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. అంతా జరిగిన మూడురోజుల తర్వాత కమిషన్ నివేదికను ప్రభుత్వం మంగళవారం బయటకు విడుదల చేసింది. అది కూడా కేవలం 60 పేజీలే. అంటే సగటున ప్రతి 11 పేజీలకు ఒక పేజీని మాత్రమే బయటపెట్టింది? తను వేసిన కమిషన్ నివేదికను వెల్లడించడంలోనూ ఎందుకా గోప్యత? ఏమిటా మర్మం? అసలు మొత్తం 665 పేజీల పూర్తి నివేదికను ప్రభుత్వం తరఫు నుంచి చదివినవారెవ్వరు? దాన్ని కుదించి 60 పేజీలుగా మార్చిందెవరు? ఏ అంశం బయటకు ఇవ్వాలనేది నిర్ణయించిందెవరు? వీటిపై ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేదు. సమాధానమూ లేదు.
కమిషన్ దాచిందా..? సర్కారా..?
వాస్తవానికి కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ 665 పేజీల నివేదికను సమర్పించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అయితే సర్కారు మాత్రం సోమవారం కేవలం 60 పేజీల నివేదికను బహిర్గతం చేసింది. 665 పేజీల రిపోర్టును సంక్షిప్తం చేసినట్టు సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం బహిర్గతం చేసిన 60 పేజీల నివేదికలో కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, పలువురు కీలక ఇంజినీర్లు టార్గెట్‌గా ఈ నివేదికను రూపొందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలోని మిగిలిన మంత్రుల పేర్లు, మిగిలిన ఐఏఎస్ అధికారుల పేర్లు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వీళ్ల పేర్లు కమిషన్ ఇచ్చిన ఒరిజినల్ నివేదికలోనే లేవా..? ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్ల పేర్లను ప్రభుత్వం కావాలనే తప్పించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ ఇచ్చిన ఒరిజినల్ నివేదికను బహిర్గతం చేయకుండా ప్రభుత్వం తాము టార్గెట్ చేసుకున్న వారిని బద్నాం చేసేలా నివేదిక రూపొందించి బహిర్గతం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.