భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు ఐకమత్యంగా ఉండాలని, మరింత చురుకుదనంతో పనిచేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం, ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కోసం బీఆర్ఎస్ జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఆదివారం గులాబీ జెండాలను ఆవిష్కరించారు. మణుగూరు తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం రేగా మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ద్రోహంపై ప్రతి గ్రామంలో బాకీ కార్డులను ప్రదర్శించాలన్నారు. సంపదను దోచుకునేందుకే రేవంత్ ప్రాధాన్యమిస్తున్నట్టు ఆరోపించారు. భద్రాచలంలో నియోజకవర్గ నాయకుడు రాంప్రసాద్ గులాబీ జెండా ఎగురవేశారు. జిల్లా వ్యాప్తంగా గులాబీ జెండాలు రెపరెపలాడాయి.