కలెక్టరేట్, మార్చి 14: చిన్నారులకు చిరుప్రాయంలోనే విద్యపై మక్కువ కల్పిస్తూ, వారి భవిష్యత్తుకు మూలాధారంగా ఉండాల్సిన అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Centers) అసౌకర్యాలకు నిలయాలుగా మారాయి. సొంత భవనాలతో పాటు అద్దె భవనాల్లో కూడా కనీస వసతులు కానరాకపోవటంతో చిన్నారులు వచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పంపేందుకు సంశయిస్తున్నారు. అలాగే గర్భిణీలు, బాలింతలు సైతం ఈ కేంద్రాల్లోకి వచ్చే పౌష్టికాహారం తీసుకునేందుకు ససేమిరా అంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో, ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాల్సిన అంగన్వాడీ కేంద్రాలు కరీంనగర్ జిల్లాలో అనేక చోట్ల బోసిపోతూ దర్శనమిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఓవైపు అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతూ ఆంగ్ల మాధ్యమంలో పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు వసతుల కల్పనలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. సొంత భవనాల నిర్మాణం చేపడుతున్నామని ప్రభుత్వం పేర్కొంటున్నా, ఉన్న వాటిలో సౌకర్యాలు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. జిల్లాలోని అత్యధిక శాతం సెంటర్లలో మరుగుదొడ్లు లేక, తాగునీటి వసతులు కానరాక, విద్యుత్ సరఫరా సైతం లేకపోవడంతో చిన్నారులతోపాటు కేంద్రాల్లో పౌష్టికాహారం తీసుకునేందుకు వచ్చే గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 777 సెంటర్లు ఉండగా, వీటిలో 307 మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి.
2001 ప్రభుత్వ పాఠశాలలకు అనుబంధంగా, మరో 259 అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో 125 కేంద్రాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. 87 కేంద్రాల్లో తాగు నీటి సౌకర్యాలు కొరవడగా, మరో 100 సెంటర్లలో మరుగుదొడ్లు లేక ఒంటికి, రెంటికి కూడా వెళ్లేందుకు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం ఇళ్లలోకి తీసుకెళ్లకుండా అక్కడే తినాల్సి రావడంతో, తాగునీళ్లు కూడా తమ వెంట తీసుకెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా బోధనకు నిలయాలుగా, ప్రీ ప్రైమరీ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటనలు చేసింది. సౌకర్యాల కల్పన కోసం అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే మహిళ, శిశు సంక్షేమ శాఖ జిల్లా యంత్రాంగం జిల్లా నుంచి పంపింది. అయితే అది మూలకు పడగా మరోసారి పంపాలని ఆదేశాలు రావటంతో తాజాగా రూ.1.35 కోట్లతో రూపొందించిన నివేదిక అనుసరించి, ప్రతిపాదనలు పంపినట్లు సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రతిపాదనలకు కూడా మోక్షం లభించేనా? లేక మరోసారి అటకెక్కేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మార్చిలోనే ఎండలు మండుతుండగా, వసతులు లేని కేంద్రాల్లోకి వస్తున్న వారి బాధలు వర్ణనాతీతంగా మారుతున్న తుత పరిస్థితుల్లో, కేంద్రాలకు సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని అంగన్వాడీ టీచర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీస సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు సత్వరమే మంజూరు చేసి, పనులు ప్రారంభిస్తే తప్ప కేంద్రాల్లో తగ్గే సంఖ్యను అడ్డుకోలేమని, అంగన్వాడీ టీచర్లు పేర్కొంటుండటం గమనార్హం.