Adilabad | ఆదిలాబాద్, మే 30(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో విత్తన సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత పదేండ్లలో లేని పత్తి విత్తనాల కొరత ఈ ఏడాది వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నది. జిల్లాలో ఈ ఏడాది వానకాలంలో 5.6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 4.16 లక్షల ఎకరాల్లోనే పత్తిని పండించనున్నారు. ఇందుకు 10.40 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని గుర్తించారు. జిల్లాలో 511 విత్తన దుకాణాల్లో ఇప్పటివరకు 3.40 లక్షల ప్యాకెట్లనే విక్రయించినట్టు అధికారులు తెలిపారు. గత కొన్నేండ్లుగా ఇక్కడి రైతులు ఆర్సీహెచ్ 659 పత్తి విత్తనాలనే ఉపయోగిస్తున్నారు. ఈ విత్తనాల కోసం దుకాణాల వద్ద బారులు తీరుతున్న రైతులకు నిరాశే మిగులుతున్నది. రైతుల డిమాండ్ మేరకు ఆర్సీహెచ్ 659 విత్తనాలు పంపిణీ కావడంలేదు. ఈ ఏడాది కంపెనీ నుంచి విత్తనాలు సరఫరా సరిగా లేదని వ్యాపారులు అంటున్నారు. ఇతర కంపెనీ విత్తనాలు కొంటే నష్టపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా రైతులకు పత్తి విత్తనాలను సరఫరా చేయడంతో విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెల్దుర్తి/ఆదిలాబాద్, మే 30: మెదక్ జిల్లా మాసాయిపేట శివారులో ఉన్న గోదాములో అనుమతులు లేకుండా విత్తనాలను ప్రాసెసింగ్ చేయడంతోపాటు ప్యాకింగ్ చేసి అమ్మకానికి తరలిస్తున్న పరిశ్రమను గురువారం సీజ్ చేసినట్టు మెదక్ జిల్లా మాసాయిపేట మండల ఏవో ఝాన్సీ తెలిపారు. యంత్రాలతోపాటు రూ.6 లక్షల విలువైన 279 క్వింటాళ్ల విత్తన బస్తాలు ఉన్నాయని తెలిపారు. గోదామును సీజ్ చేశామని, యజమానులపై ఫిర్యాదు చేయనున్నట్టు ఏవో ఝాన్సీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విత్తనాల సరఫరాలో రైతులకు ఇబ్బందులు సృష్టించారని నిఖిల్ ఫర్టిలైజర్కు చెందిన యజమాని రాకేశ్రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు టూటౌన్ సీఐ అశోక్ తెలిపారు. ఆదిలాబాద్ అర్బన్ మండల వ్యవసాయాధికారి రమేశ్ ఫిర్యాదు మేరకు వ్యాపారిపై 420 కేసు నమోదు చేసినట్టు తెలిపారు.