హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లులు.. పెండింగ్ డీఏల సరసన పెండింగ్ పారితోషికం కూడా చేరింది. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం చేసినందుకు అందించే రెమ్యునరేషన్ ఇంత వరకు అందలేదు. నిరుటి బకాయిలను సర్కార్ ఇంత వరకు విడుదల చేయలేదు. ఏడాది గడిచినా ఇవ్వకపోవడంతో టీచర్లు గగ్గోలుపెడుతున్నారు. 2025లో పదో తరగతి వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన పారితోషికం ఇంకా అందలేదు. అంతేకాకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పారితోషికం కూడా మంజూరుచేయలేదు.
ఈ మొత్తం రూ. 10కోట్లకు పైగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. సంబంధించిన టోకెన్లు కూడా జారీ అయ్యాయి. కానీ టీచర్ల ఖాతాల్లో మాత్రం జమకాలేదు. 19 క్యాంపుల్లో ఈ నెల 1 నుంచి 2016 విద్యాసంవత్సరం జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. కిందిస్థాయి ఉద్యోగి నుంచి క్యాంప్ ఆఫీసర్ వరకు 25వేల మంది విధుల్లో పాల్గొంటున్నారు. తమకు అందాల్సిన రెమ్యునరేషన్ ఇంకా విడుదల కాకపోవడంతో స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. అయినా సర్కార్ స్పందించిన దాఖలాల్లేవు.
పదో తరగతి మూల్యాంకన రేట్లను 2018లో పెంచారు. దాదాపు 8 ఏండ్లు పూర్తికావొస్తున్నా మళ్లీ పెంచలేదు. ఈ ధరలు పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే ఇంటర్ మూల్యాంకన రేట్లను పెంచారు. ఇంటర్లో ఒక పేపర్‌కు ఇదివరకు రూ. 23.66 ఉంటే.. ఈ సారి 29.57కు పెంచారు. కానీ పదో తరగతికి పేపర్‌కు రూ. 10 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ వ్యత్యాసమేంటని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. తాము గొంతు చించుకుంటున్నా మూల్యాంకన రేట్లు పెంచకపోవడంపై ఫైర్ అవుతున్నారు.