హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఉద్యోగులకు 51 శాతం ఫిట్మెంట్తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలని టీఎన్జీవోల సంఘం నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానం(ఓపీఎస్)ను అమలు చేయాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ ముజీబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, పలు తీర్మానాలు చేశారు.
సీపీఎస్ ద్వారా రికవరీ చేసిన నగదును 13 నెలలుగా ఉద్యోగుల ఖాతాల్లోకి బదిలీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, గచ్చిబౌలిలోని ఇండ్ల స్థలాలు బీటీఎన్జీవోస్ సొసైటీకి కేటాయించేందుకు అడ్డుగా ఉన్న ప్రభుత్వ మెమోను రద్దు చేయాలని, హెల్త్‌కార్డుల విషయంలోనూ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, పంచాయతీ కార్యదర్శులపై పనిభారాన్ని తగ్గించాలని, హాస్టల్ వెల్ఫేర్ శాఖలో ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలోనే హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులతో టీఎన్జీవోస్ 80వ ఆవిర్భావసభ నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్లు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
1. 2023 జూలై 1 నుంచి అమలయ్యేలా 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి.
2. పెండింగ్ డీఏలు మంజూరు చేయాలి, బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి.
3. పెండింగ్ బిల్లులను
వెంటనే చెల్లించాలి
4. సీపీఎస్‌ను రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలి.
5. గచ్చిబౌలి ఇండ్ల స్థలాలను బీటీఎన్జీవో సొసైటీకీ కేటాయించాలి.
6. టీఎన్జీవో గచ్చిబౌలి సెకండ్ ఫేజ్‌లోని స్థలాల యాజమాన్య హక్కు లు సొసైటీకి బదలాయించాలి.
7. వివిధ కారణాలతో సస్పెన్షన్ వేటుపడ్డ ఉద్యోగులను నిబంధల మేరకు విధుల్లోకి తీసుకోవాలి.