హైదరాబాద్, మార్చి 17: వ్యాపారాభివృద్ధిపై దేశీయ పౌల్ట్రీ ఇండస్ట్రీ దిగ్గజం వెంకటేశ్వర హ్యాచరీస్ (వీహెచ్) గ్రూప్, కాబ్-వ్యాంట్రెస్ల జాయింట్‌వెంచర్ వెన్‌కాబ్ దృష్టి సారించింది. ఇందులోభాగంగానే కాబ్-వ్యాంట్రెస్.. దాని మాతృ సంస్థ, అమెరికా బహుళజాతి దిగ్గజం టైసన్ ఫుడ్స్ ప్రతినిధులతో ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని వీహెచ్ గ్రూప్ నిర్వహించింది. ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని ఆయా కంపెనీలు నిర్ణయించాయి. పౌల్ట్రీ పరిశ్రమ, ప్రస్తుత మార్కెట్ తీరుతెన్నులతోపాటు.. ఈ రంగంలో వస్తున్న నూతన మార్పులను అందిపుచ్చుకొని నిలకడైన వృద్ధిని సాధించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టైసన్ ఫుడ్స్ ప్రతినిధి జాన్ ఆర్ టైసన్, కాబ్-వ్యాంట్రెస్ సభ్యులు విలియం, రాయ్ తదితరులు పాల్గొన్నారు.
24 నుంచి సాయి పేరెంటరల్స్ ఐపీవో
హైదరాబాద్, మార్చి 17: ప్రముఖ ఫార్మా సంస్థ సాయి పేరెంటరల్స్ నెల 24 నుంచి 27 వరకు ఐపీవోకి రాబోతున్నట్టు ప్రకటించింది. షేరు ధరల శ్రేణిని రూ.372-392గా నిర్ణయించినట్టు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి సమర్పించిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో వెల్లడించింది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో రూ.5 ముఖ విలువ కలిగిన 32 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా గరిష్ఠంగా రూ.285 కోట్ల నిధులను సమీకరించాలని సంస్థ యోచిస్తున్నది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 23న షేర్లను విక్రయించనున్నది. ఈక్విటీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయనున్నట్టు పేర్కొంది. వాటా విక్రయంతో సేకరించిన నిధులను అంతర్జాతీయ వ్యాపార విస్తరణకు, ప్లాంట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, రుణాలను తిరిగి చెల్లించడానికి, వర్కింగ్ క్యాపిటల్ కోసం వినియోగించనున్నట్టు కంపెనీ సీఎండీ అనిల్ కేకే తెలిపారు.