హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగులు సమరానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ సర్కార్‌పై యుద్ధం ప్రకటించనున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి సుమారు 45 రోజులు ఏకధాటిగా ఉద్యమబాట పట్టనున్నారు. ఈ మేరకు ఈ నెల 19న సమావేశమై ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగులంతా విసిగి వేసారిపోయారు. ఒకటి, రెండు సార్లు కాదు.. పలుమార్లు ఉద్యోగుల డిమాండ్లను రేవంత్ సర్కార్ విస్మరించింది. కమిటీలతో కాలయాపన చేస్తూ వచ్చింది. దీంతో రగిలిపోతున్నారు. సమరమే శరణ్యమని ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లు, సమస్యలను పంద్రాగస్టు లోగా పరిష్కరించాలన్న జేఏసీ గడువు ఈ నెల 15తో పూర్తయింది. జేఏసీ విధించిన ఈ అల్టిమేటం, గడువుపై కాంగ్రెస్ సర్కారు స్పందించనేలేదు. ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు కూడా ఆహ్వానించలేదు. దీంతో ఉద్యోగుల జేఏసీ పోరుబాటకు సిద్ధమవుతున్నది. సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నది. సెప్టెంబర్ 1 నుంచి రాబోయే నెలన్నర రోజుల్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సన్నద్ధమవుతున్నది.
సర్కారుకు జేఏసీ విధించిన గడువు ఆఖరు రోజైన శుక్రవారం సర్కారు నుంచి పిలుపు వస్తుందని జేఏసీ నేతలు భావించారు. సర్కారు పిలుపుకోసం సాయంత్రం వరకూ ఎదురుచూశారు. అలాంటిదేమీ లేకపోవడంతో సమరభేరిని మోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 19న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ జేఏసీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 200కు పైగా సంఘాలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. అన్ని సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి, కార్యాచరణను ప్రకటించాలని భావిస్తున్నారు. జిల్లాల వారీగా ఇన్చార్జులను నియమించి ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించాలన్న ఆలోచనలో జేఏసీ నేతలు ఉన్నారు. అన్ని వర్గాల మద్దతును కూడగట్టి సర్కారుపై సమరం సాగించాలన్న గట్టి నిర్ణయానికి జేఏసీ నేతలు వచ్చారు. తమ ఓపికను, సహనాన్ని సర్కారు అలుసుగా భావిస్తున్నదని, ఇక ఎంతమాత్రం ఉపేక్షించరాదన్న పట్టుదలతో జేఏసీ నేతలు ఉన్నారు.
సర్కారు జేఏసీ హెచ్చరికలను ఖాతరు చేయకపోవడం, కనీసం విలువ ఇవ్వకపోవడంపై జేఏసీ నేతలు, ఉద్యోగులు రగిలిపోతున్నారు. సర్కారుకు ఉద్యోగుల సత్తాను చూపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచే పోరుబాటకు శ్రీకారం చుట్టాలనే యోచనలో ఉన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఎస్‌ను రద్దు చేయాలని, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో గన్‌పార్క్ లేదా, లలిత కళాతోరణంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ సభను నిర్వహించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. మరునాడైన సెప్టెంబర్ 2న సీఎస్‌కు నోటీసులను అందజేస్తారు. ఆ తర్వాత నల్లబ్యాడ్జీలతో నిసరన, మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళనలు, గాంధీ బ్యాడ్జీలతో శాంతియుతంగా విధులకు హాజరై నిరసనలను వ్యక్తంచేస్తారు. ఆ తర్వాత జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాలని భావిస్తున్నారు. సుమారు 45 రోజుల పాటు నిరసనలు కొనసాగుతాయి. ఆ తర్వాత పెన్‌డౌన్ చేసి సర్కారును స్తంభింపజేయనున్నారు. దసరాకు ముందే ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని లక్షలాది మంది ఉద్యోగులతో కదం తొక్కాలని భావిస్తున్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సర్కారు పలుమార్లు మాట ఇచ్చి మోసం చేసింది. కమిటీ వేయాలి.. సాగదీయాలి అన్నట్టుగా సర్కారు తీరు ఉన్నది. ఉద్యోగుల జేఏసీ మొత్తం 63 డిమాండ్లను సర్కారు ముందు ఉంచింది. 200కు పైగా సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. జేఏసీగా ఏర్పడ్డ తర్వాత ఉలిక్కిపడ్డ రాష్ట్ర సర్కారు.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నేతలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, దివ్యా దేవరాజన్‌తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కమిటీ ఉద్యోగులతో ఒక్కసారి కూడా భేటీ కాలేదు. ఒక్క సమస్యనూ పరిష్కరించలేదు. ఆ తర్వాత విసిగి వేసారిన ఉద్యోగుల జేఏసీ కార్యాచరణను ప్రకటించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో జేఏసీ నేతలతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి 2024 డిసెంబర్‌లోపు ఆర్థికేతర సమస్యలు, 2025 మార్చిలోపు ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆఖరుకు ఇది కూడా నెరవేరలేదు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు డీ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో మరో కమిటీని ఏర్పాటు చేశారు. నెలకు రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను మంజూరు చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ హామీ నీటిమూటే అయింది. ఈ కమిటీ కూడా ఒక్క సమస్యనూ తీర్చలేదు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, కృష్ణభాస్కర్, లోకేష్‌కుమార్‌తో మరో కమిటీని వేశారు. ఈ కమిటీ పలు దఫాలు చర్చించి, సర్కారుకు కొన్ని సిఫారసులు చేసింది. ఇప్పుడు ఒక డీఏ, ఆరు నెలల్లో రెండో డీఏను ఇస్తాం, జీవోను ఇప్పుడే ఇస్తామన్నారు. కానీ ఒక డీఏ ఇచ్చి రెండో డీఏకు జీవోనే ఇవ్వలేదు. ఇలా మోసాల మీద మోసాలు చేసిన కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగులు, జేఏసీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఉద్యోగుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం 200 సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, నాలుగో తరగతి ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశావర్కర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులంతా జేఏసీలో భాగసాములయ్యారు. ఇలా అందరూ ఏకతాటిపైకి రావడం ఇదే తొలిసారి. 2011లో తెలంగాణ రాష్ట్రసాధన కోసం సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. అప్పట్లో తెలంగాణ ఏర్పాటు ప్రకటనపై వెనక్కి వెళ్లిన సందర్భంలో కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ ఉద్యోగ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పడు కాంగ్రెస్ సర్కారు హయాంలోనే 200 సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. ఉద్యోగ సంఘాలన్నీ కలిసికట్టుగా పోరాడుతున్నాయి. అప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే రాష్ర్టాన్ని పాలిస్తుండటం గమనార్హం.
ఉద్యోగుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సర్కార్ కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప కార్యాచరణ శూన్యం. ఆగస్టు 15లోపు పరిష్కరించాలని గడువు విధించాం. ఈ గడువులోగా కనీసం ఆర్థికభారం లేని సమస్యలను కూడా పరిష్కరించకపోవడం ఆందోళనకరం. ఉద్యోగులపై ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీనతకు ఇదే నిదర్శనం. ఈ నెల 19న జేఏసీ నేతలతో సమావేమవుతున్నాం. అదే రోజు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాం.
సీపీఎస్‌ను రద్దు చేస్తామన్నారు. రెండేండ్లు అవుతున్నా సీపీఎస్ గురించి మాట్లాడటమే లేదు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎలాంటి కోర్టు చిక్కులు లేని కారణంగా టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను రూపొందించమన్నాం. ఈహెచ్ఎస్ను అమలు చేయమన్నాం. మాకు న్యాయంగా దక్కాల్సినవే అడుగుతున్నాం. మ్యానిఫెస్టోలో పెట్టినవే ఇవ్వమంటున్నాం. ఉద్యోగులపై సర్కారు తీరును నిరసిస్తున్నాం.
ఉద్యోగులు జీపీఎఫ్‌లో దాచుకున్న డబ్బులనూ తీసుకోలేని పరిస్థితి ఉన్నది. పిల్లల పెండ్లిళ్లకో, దవాఖాన ఖర్చులకో ఇవి ఉపయోగపడతాయనుకుంటే, వాటిని కూడా ఇవ్వడంలేదు. తీవ్ర ఒత్తిడి చేస్తే 2024 జూలై వరకు ఉన్నవే క్లియర్ చేశారు. జేఏసీ ఏ పిలుపునిచ్చినా, ఏ కార్యాచరణను ప్రకటించినా విజయవంతం చేసేందుకు మేం ముందుంటాం. ఉద్యోగుల తడాఖా ఏమిటో చూపిస్తాం.