Telangana | హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది. హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. రిటైరైన ఏడాది తరువాత కూడా డబ్బులు చేతికి అందకపోవడం, తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటం వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నది. 2024లో 7,995 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందగా, వారికి ఇవ్వాల్సిన రూ.4,000 కోట్ల విలువైన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ సమస్య పరిషారం కోసం కొందరు విశ్రాంత ఉద్యోగులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 45 రోజుల్లోగా వడ్డీసహా మొత్తం ఆర్థిక ప్రయోజనాలు అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆర్థిక స్థామత లేని విశ్రాంత ఉద్యోగులు తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘అప్పులోళ్లకు ముఖం చూపించలేక వేరే ఊళ్లో తలదాచుకుంటున్న. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని తాజాగా ఒక ఏఎస్సై తీసిన సెల్ఫీ వీడియో విశ్రాంత ఉద్యోగుల దుర్భర పరిస్థితికి అద్దంపడుతున్నది.
ఒక్కొక్కరికి 35-75 లక్షల వరకు రావాలి
తెలంగాణలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3.59 లక్షలు. ఇందులో టీచర్లు 1.1 లక్షలు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 59 నుంచి 61 ఏండ్లకు పెంచింది. ఆ గడువు గత ఏడాది మార్చితో ముగియడంతో 2024 డిసెంబర్ 31 వరకు 7,995 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఉద్యోగ విరమణ పొందిన ఒక్కొక్కరికి గ్రాట్యూటీ, వేతనం నుంచి నెలనెలా దాచుకున్న జీపీఎఫ్, జీఎల్ఐ, సీపీయూ, సరెండర్ లీవుల కింద ఏక మొత్తంలో సర్కారు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి హోదాను బట్టి సగటున ఒక్క విశ్రాంత ఉద్యోగికి రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ తేదీకి నాలుగు నెలల ముందే అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయానికి ఉద్యోగ విరమణ చేయబోతున్నట్టు ఉద్యోగికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తారు. ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్‌ను లెక్కగట్టి ఆయా జిల్లాల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వివరాలను ఈ-కుబేర్‌కు పంపిస్తారు. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం రూ.4,000 కోట్ల వరకు ఉన్నది. ఈ-కుబేర్ నుంచి విశ్రాంత ఉద్యోగులకు డబ్బులు చెల్లించాలంటూ ప్రభుత్వం పబ్లిక్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో) ఇవ్వాల్సి ఉంటుంది. ఖజానా నిండుకున్నదనే సాకుతో ఈ-కుబేర్ నుంచి క్లియరెన్సులు ఇవ్వడం లేదు. దాంతో పదవీ విరమణ రోజునే హక్కుగా అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడాది దాటినా అందకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పెండింగ్‌లో అనేక బిల్లులు
ఆర్థికశాఖ వద్ద అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మెడికల్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), టీజీజీఎల్ఐ, హెచ్‌బీఏ, వేతనం, ఇంక్రిమెంట్ బిల్లులు, పెన్షన్ బెనిఫిట్స్ వంటివి ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇంకా చాలా శాఖల్లో ఒకటో తేదీన వేతనాలు రావడం లేదు.
ఆరు వారాల్లో వడ్డీసహా చెల్లించండి
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. నల్లగొండ జిల్లాకు చెందిన మొగుళ్లపల్లి భాస్కర్, మంచిర్యాల జిల్లాకు చెందిన ఆగాచారి, మెదక్ జిల్లాకు చెందిన కొండ్రు గంగయ్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన అన్నపూర్ణమ్మతోపాటు విశ్రాంత ఉద్యోగులు, టీచర్లు తమకు జీపీఎఫ్, జీఎల్ఐ, సాలరీ ఏరియర్స్తోపాటు రిటైర్మెంట్ ఫైనల్ బెనిఫిట్స్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఆరు వారాల్లోగా వడ్డీసహా విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
పోరాడి సాధించుకుందాం
ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్న ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎనిమిది వేల మంది ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్స్ అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాదిక్ సెల్ఫీ వీడియో కలచివేసింది.
– దేవీప్రసాద్. జేఏసీ మాజీ చైర్మన్
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య
రిటైర్ అయి 8 నెలలైంది. ప్రైవేట్ ఫైనాన్స్ హౌసింగ్ లోన్ తీసుకున్న. తోటి ఉద్యోగుల వద్ద కొంత అప్పు చేసిన. రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు వస్తే వారికి చెల్లిద్దామనుకున్న. నేటికీ ఎనిమిది పైసలు కూడా రాలేదు. రైతు ఆత్మహత్య చేసుకుంటే అప్పటికప్పుడు రూ.5 లక్షలు ఇస్తున్నరు. డబ్బుల కోసం అప్పులవారు ఇంటికి వస్తుండటంతో నేను ఊర్లు తిరుగుతూ దాకుంటున్న. ఇలాంటి దుస్థితి వచ్చింది నాకు. ఏం చేయాలో తోచక వీడియో తీసిన. నేను చనిపోతే నా కొడుకు పైసలు ఇస్తే తీసుకోండి. లేకపోతే నన్ను క్షమించండి. చేతులు జోడించి వేడుకుంటున్న. దయచేసి ఈ వీడియోను సీఎం రేవంత్‌రెడ్డికి చేరే వరకు వైరల్ చేయండి.
-రిటైర్డ్ ఏఆర్ ఎస్సై సాదిక్, మహబూబ్‌నగర్ (ఈ సెల్ఫీ వీడియో ఈ నెల 8న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది)