హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ భూ కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురిస్తున్న కథనాలు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు తెలియజేస్తుండటంతో పెద్దల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. గత నెల 17న జరిగిన క్యాబినెట్ భేటీలో ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇండస్ట్రియల్ భూములను కన్వర్షన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. భూముల కన్వర్షన్‌కు సంబంధించి క్యాబినెట్ నోట్ మరుసటి రోజునే ‘నమస్తే తెలంగాణ’ చేతికి చిక్కింది. దీనిపై సంచలన కథనాన్ని ప్రచురించగా అది ప్రకంపనలు సృష్టించడమే కాకుండా ప్రభుత్వాన్ని షేక్ చేసింది. ఆ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ హిల్ట్ పాలసీకి సంబంధించి మరింత సమాచారంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నదంటూ చేసిన సంచలన ఆరోపణలు మరింత టెన్షన్‌కు గురిచేసింది.
కేటీఆర్ ఆరోపణలతో తీవ్రంగా వణుకు మొదలై పాలసీకి సంబంధించిన సమాచారం ‘నమస్తే తెలంగాణ’కు, ప్రతిపక్షానికి ఎలా చేరిందనే అంశంపై ప్రభుత్వంలో ఆందోళన మొదలైనట్టు తెలిసింది. అసలు సమాచారం ఎక్కడి నుంచి వెళ్లిందో తెలుసుకోవడంపై దృష్టి పెట్టడమే కాకుండా ప్రభుత్వం ఏకంగా అంతర్గతంగా విజిలెన్స్ విచారణకూ ఆదేశించిందంటే ఒకరకంగా సర్కార్ తనపై తానే విచారణకు ఆదేశించుకున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణలో భాగంగా రేవంత్ ప్రభుత్వం ప్రాథమికంగా రెండు విభాగాలకు చెందిన అధికారులను గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. సీఎంవోలోకి కొద్దిరోజుల కిందట వచ్చిన ‘ఆరడుగుల’ ఓ కీలక అధికారి, ఐటీ విభాగంలోని మరో అధికారిపై అనుమానపడుతున్నట్టు సమాచారం. విషయం ఆ ఇద్దరి నుంచే బయటకు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అదీకాకుండా గతంలో సీఎంవోలో పని చేసి ప్రస్తుతం మరో కీలక పదవిలో ఉన్న వ్యక్తిపైనా అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా వినికిడి.
మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ భూకబ్జాకు సంబంధించి ‘నమస్తే తెలంగాణ’ సంచలనాత్మకమైన కథనాన్ని ప్రచురించగా మొదట మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. అయితే ఆ మరుసటి రోజే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీపై నమోదైన ఎఫ్ఐఆర్ బయటకు రావడంతో మంత్రి నోట్లో పచ్చి వెలక్కాయ పడినైట్లెందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమాచారం కూడా సీఎంవోలోని కీలక పదవిలో ఉన్న వ్యక్తి నుంచే బయటికి వెళ్లినట్టు ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. మొత్తంగా ఇటు హిల్ట్ పాలసీ, అటు పొంగులేటి వ్యవహారంలో ముగ్గురు అధికారుల తీరుపై సందేహంగా ఉన్న సర్కార్ వారి వ్యవహారాన్ని ఎలా బయటపెట్టాలనే విషయమై ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.