Rythu Bharosa | రైతు భరోసా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీని నెరవేరుస్తామని అన్నారు. సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రెండు గంటల పాటు కసరత్తు చేశారు. రైతుబంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు అందించిన తీరు.. కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన సమయంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు.
ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోసారి రైతు భరోసాపై సమావేశం కావాలని నిర్ణయించింది.
కాగా, సబ్‌కమిటీ భేటీ అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఏడాది పాటు శ్రమించినా అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికి వస్తుందో రాదో అని భయాలు నిత్యం రైతులను వెంటాడుతున్నాయని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. అందుకే పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తుందని తెలిపారు. పంటలకే కాదు రైతు కుటుంబానికి భరోసాగా నిలిచేందుకు రైతు బీమా పథకం కింద రైతుల పక్షాన ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు.
2024-25 లో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2023-24 ఏడాదికి గాను ఆయిల్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం 80.10 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తం 133.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.