హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ విద్యలో ప్రతిపాదిత మార్పులపై కాంగ్రెస్ సర్కార్ వెనుకంజ వేసింది. విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ ఉధృతమైనందున ఎట్టకేలకు నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు పాలిటెక్నిక్ విద్యలో మార్పులపై పరిశీలన కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు అధ్యక్షతన ఆరుగురితో కమిటీని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ శాంతాసిన్హా, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ‘శక్తి’ శాఖ కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. 30 రోజుల్లో అన్ని వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి సమగ్ర అధ్యయనం చేసి, నివేదిక అందజేయాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది.
బీఆర్ఎస్ ఉద్యమబాట.
పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానిస్తూ ప్రభుత్వం జీవో-97ను జారీచేసిన విషయం తెలిసిందే. ఇటీవల క్యాబినెట్ కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే విద్యార్థి లోకం భగ్గుమన్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలన్నీ ఉద్యమ కేంద్రాలుగా మారిపోయాయి. విద్యార్థుల పోరాటానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించింది. తెలంగాణ భవన్‌ను జనతా గ్యారేజ్గా భావించి పెద్ద ఎత్తున విద్యార్థులు ఇకడికి చేరి తమ గోడు చెప్పుకొన్నారు. ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రవీణ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి, బోయినపల్లి వినోద్‌కుమార్, దాసోజు శ్రవణ్‌లు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
జలక్ ఇచ్చిన విద్యార్థి ఉద్యమం
కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్వీ, ఏబీవీపీ, ఏఐఎఫ్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాలు వీరి ఉద్యమానికి తోడవడంతో పోరాటాన్ని హోరెత్తించాయి. బోధన, బోధనేతర సిబ్బంది శక్తి శాఖ (కార్మిక శాఖ)లో విలీనం చేయడం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఏర్పాటైన స్కిల్స్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తరఫున మంత్రి వివేక్ వెంకటస్వామి విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గలేదు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన జరిపిన చర్చల్లోనూ విద్యార్థులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. జీవో-97ను ఉపసంహరించుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ఈ స్థాయిలో ప్రతిఘటన ఊహించని సర్కార్.. పునరాలోచనలో పడింది. వెంటనే సంప్రదింపుల కోసం కమిటీ వేసింది.