హైదరాబాద్, జనవరి2 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్ల సమస్య పరిష్కారానికి ఐదుగురితో కూడిన ఫైవ్‌మెన్ కమిటీని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం ప్రమోషన్లపై సమీక్షించారు. ఈ మేరకు కమిటీ సభ్యులను నియమిస్తున్నట్టు ప్రకటించారు. సాగునీటిశాఖ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఈఎన్సీలు అనిల్‌కుమార్, విజయభాస్కర్‌రెడ్డిని ఆ కమిటీలో నియమించారు. ఏఈ నుంచి సీఈ వరకు ప్రమోషన్ల నివేదికను 15 రోజుల్లోగా అందజేయాలని కూడా నిర్దేశించినట్టు మంత్రి వెల్లడించారు. ఈ నెలాఖరు నాటికల్లా ప్రమోషన్లతోపాటు, బదిలీలను కూడా పూర్తిచేస్తామని తెలిపారు. అదేవిధంగా నూతనంగా ఎంపికైన ఇంజినీర్లను పూర్తిగా నియమించాలని సూచించినట్టు వెల్లడించారు.
సమావేశంలో సెక్రటరీతోపాటు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని పలువురు ఇంజినీర్లు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరిగేషన్ శాఖలో ఇప్పటికే ఇద్దరు ఈఎన్సీలు, 11 మంది చీఫ్ ఇంజినీర్లు, 59 మంది ఎస్ఈలు, 30 మందికిపైగా ఈఈలు ఉద్యోగ విరమణ పొందారు. ఆయా స్థానాల్లో అధికారులను నియమించకుండా ఇన్చార్జీలు, ఇతరులకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్లో పాలన గాడి తప్పింది. ఆయా అంశాలపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ వరుస ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు.
ఇరిగేషన్ శాఖలో మరోసారి సాగునీటి సంఘాల ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రం ఏర్పడక ముందు స్థానిక రైతులతో చెరువులు, సాగునీటి కాల్వల పరిధిలో సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసేవారు. ఎన్నికలు నిర్వహించి వాటికి అధ్యక్షులను, ఇతర డైరెక్టర్లను సభ్యత్వాలు ఉన్న రైతులు ఎన్నుకునేవారు. ఇప్పుడు మళ్లీ ఆ సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయాలని సరారు నిర్ణయించినట్టు తెలిసింది. సంఘాల ఎన్నిక ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఎన్నికలు నిర్వహించాలా? లేదంటే నామినేట్ చేయడమా? అన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.