liquor shop | హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగిసింది. మొత్తం 89,344 దరఖాస్తులు వచ్చాయి. 23న డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం వ్యాపారుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దరఖాస్తుల ద్వారా ఖజానాకు ఊహించినంత సొమ్ము రాకపోవడంతో దరఖాస్తు గడువును 23వ తేదీ వరకు పెంచింది. అలాగే డ్రా 17న తీస్తామని ప్రకటించింది. దరఖాస్తులకు చివరి రోజున ‘బీసీబంద్’ కారణంగా చాలామంది వ్యాపారులు దరఖాస్తులను సమర్పించలేకపోయారని ప్రభుత్వం చెప్తున్నది. తాజా నిర్ణయంతో ఆ ఆదాయం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రభుత్వం ఒక్కసారిగా మద్యం దరఖాస్తుల గడువు పెంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్ణీత గడువుతో నోటిఫికేషన్, షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఏకపక్షంగా గడువు పొడిగింపు న్యాయపరంగా చెల్లుబాటు కాదని నిపుణులు చెప్తున్నారు. గడువు పెంపుపై ఎవరైనా కోర్టుకెళ్తే, ప్రభుత్వానికి అక్కడ ఎదురుదెబ్బ తగిలితే గడువు తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు అనర్హులుగా మిగిలిపోతారని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఈ మేరకు 2019లో ఏపీలో జరిగిన ఇలాంటి ఘటననే ఉదహరిస్తున్నారు. బార్ల లైసెన్స్ గడువు పొడిగింపులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏకపక్ష నిర్ణయం న్యాయ సమ్మతం కాదని ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి తీర్పు చెప్పారు. ఇప్పుడిదే విషయాన్ని గుర్తుచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదని చెప్తున్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో వ్యాపారుల ఆశలు గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తున్నది. దీంతో కొందరు వ్యాపారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. వారిచ్చిన స లహా మేరకు ఆర్టికల్ 14 ప్రకారం ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదు. 2019, నవంబర్లో అప్పటి ఏపీ ప్ర భుత్వం జీవో నంబర్ 473 ద్వారా 2020-21 సంవత్సరానికి బార్ పాలసీ ప్రకటించింది.
అదే నెల 29న గెజిట్, నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 7న లాటరీ తీస్తామని తెలిపింది. అయితే, దరఖాస్తులు తక్కువ వచ్చాయన్న ఉద్దేశంతో దరఖాస్తు స్వీకరణ గడువును ప్రభుత్వం డిసెంబర్ 6 నుంచి 9కి పెంచుతూ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం సహేతుకం కాదని పేర్కొంది.