హైదరాబాద్, కరీంనగర్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గోదావరిఖని: సింగరేణి కార్మికులను కాంగ్రెస్ సర్కారు వంచించింది. లాభాల్లో వాటా, బోనస్ విషయంలో మోసం చేసింది. మొ త్తం లాభాల్లో వాటా ప్రకటించకుండా… అందులో వేలకోట్ల రూపాయలను పక్కన పెట్టి, మిగిలిన మొత్తంలో వాటాను ప్రకటించింది. దీంతో కార్మికులకు దక్కాల్సిన భారీ బోనస్ అరకొరగా అందనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభాలు, బోనస్‌లో ప్రభుత్వ పన్నులు పోను సంస్థ రూ.6,394 కోట్ల లాభాలు గడించినట్టు సర్కారు వెల్లడించింది. వీటిలో కొత్త ప్రాజెక్ట్‌ల కోసం రూ.4,034 కోట్లను పక్కనపెట్టినట్టు తెలిపింది. రూ.2,360 కోట్లకు లాభాల బోనస్‌ను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. బోనస్‌తో ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 లబ్ధి చేకూరుతుందని, 71వేల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పింది.
ఈ మేరకు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి సింగరేణి లాభాలు, బోనస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గతంలో సింగరేణి కోల్పోయిన, ప్రైవేట్ సంస్థలు దక్కించుకున్న రెండు గనులను సింగరేణి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలకు క్రాస్ సబ్సిడీని సకాలంలో చెల్లించలేకపోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన క్రాస్ సబ్సిడీ పెండింగ్‌లో ఉన్న విషయం నిజమేనని స్పష్టంచేశారు. బోనస్‌గా రూ.2,173 కోట్లను ప్రకటించాల్సి ఉండగా, రూ. 819 కోట్లను మాత్రమే ఇస్తున్నట్టు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన బోనస్ మొత్తం 12శాతమేనని చెప్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్‌పై కార్మికుల కన్నెర్ర
లాభాల వాటా పట్ల సింగరేణి కార్మికులు పెదవి విరిచారు. నిరుటి కంటే లాభాలను రూ.52 కోట్లు తక్కువకు బోనస్ ఇచ్చారని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. 33 నుంచి 34శాతానికి లాభాల వాటా ప్రకటించినట్టు చూపుతూ.. అంకెల గారడీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సింగరేణిలో ఏడాది కాలంలో దాదాపు 4వేల మంది ఉద్యోగ విరమణ చేశారని, కార్మికుల సంఖ్య తగ్గడం వల్లే ఒక్కో కార్మికుడికి అందే మొత్తం పెరిగినట్టు కనిపిస్తున్నదని చెప్తున్నారు. 2023 -24 సంవత్సరంలో మొత్తం లాభాన్ని రూ.4,701 కోట్లుగా ప్రకటించారు. అప్పుడు కూడా సగం లాభాలను పక్కనపెట్టి, మిగతా సగానికే బోనస్ ఇచ్చారు. నిరుడు మొత్తం లాభం 4,701 కోట్లకు గాను.. ప్రకటించిన రూ.796 కోట్ల బోనస్‌ను లెక్కిస్తే.. 16.93 శాతమే అయ్యిందని, ఈ ఏడాది కూడా పాత కథే పునరావృతమైందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కార్మికులకు మరోసారి దగా
అహర్నిశలు శ్రమించి ప్రాణాలను పణంగా పెట్టి, బొగ్గును తీస్తూ.. సింగరేణిని లాభాల బాట పట్టిస్తున్న కార్మికుల కష్టాలను కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నదని కార్మికులు మండిపడుతున్నారు. నికర లాభాల నుంచి పెద్దమొత్తంలో డబ్బులను పక్కన పెట్టి.. తృణప్రాయంగా బోనస్ ప్రకటిస్తూ.. చేతులు దులుపుకొంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రకటనలే దీనికి నిలువెత్తు నిదర్శనమని కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. నిరుడు ఇదే పద్ధతిలో అరకొరగా లాభాల వాటాలు పంచిందని, ఈ సారి కూడా నిరాశే ఎదురైందని కార్మికులు చెప్తున్నారు. ఈ సారి లాభాలు పెరిగినా కార్మికులకు వచ్చే లాభాల వాటాలో కోత పెట్టడం దారుణమని మండిపడుతున్నారు. వాస్తవ లాభాలపైన కార్మికులకు వాటా చెల్లించి అనంతరం సంస్థ అభివృద్ధికి నిధులను ఖర్చు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లపాటు కేసీఆర్ సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించి.. వాటిపైనే లాభాల వాటాను చెల్లిస్తూ వచ్చారని కార్మికులు గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కార్మికులకు లాభాల వాటా దక్కకుండా చేస్తున్నదని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు మండిపడుతున్నారు.
సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ద్రోహం: హరీశ్‌రావు
సమైక్యరాష్ట్రంలో, ఇప్పుడు సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణి కార్మికులకు ఇచ్చే లాభాల వాటాలో కోత విధించడంపై సోమవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. సింగరేణి కార్మికుల బోనస్‌ను రేవంత్ ప్రభుత్వం బోగస్ చేసిందని మండిపడ్డారు. మొత్తం రూ. 6394 కోట్ల లాభాలు గడిస్తే, కేవలం 2360 కోట్లలో వాటాలు ఇవ్వడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులకు సంక్షేమ ఫలాలు అందగా.. నేడు కాంగ్రెస్ పాలనలో ఘోరమైన సంక్షోభం నెలకొందని విమర్శించారు. కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని తెలిపారు.
కార్మికుల బోనస్‌లో అన్యాయం: కొప్పుల
సింగరేణి కార్మికులకు బోనస్.. కాంగ్రెస్ మార్క్ బోగస్ అని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడుతూ సింగరేణిని సిరుల గణిగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుందని స్పష్టంచేశారు. సింగరేణి కార్మికుల లాభాల వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి మోసం చేసిందని మండిపడ్డారు. రెండేండ్లలో సంస్థ అభివృద్ధి పేరిట పక్కన పెట్టిన రూ.6323 కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మొదటి నుంచీ సింగరేణి కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడిందని విమర్శించారు.
రేవంత్ సర్కార్ తీరుపై నిరసనలు
నికర లాభాల మీద 34 శాతం బోనస్ ఇవ్వాల్సి ఉండే. కానీ రూ.4వేల కోట్లను పక్కనపెట్టి లాభాల వాటాను పంచడం వల్ల కార్మికులకు రెండింతలు నష్టం జరిగింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరకలాభాలపై ప్రకటించాల్సి ఉండే. ఇదంత చూస్తే కార్మికులకు లాభాల వాటాను ఇవ్వడం ఇష్టంలేనే ఇలా చేసినట్టు అనిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ మంగళవారం కార్మికులు నల్లబ్యాడ్జీలతో బొగ్గు గనుల మీద నిరసనలు వ్యక్తంచేస్తాం.
-మిర్యాల రాజిరెడ్డి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఏకపక్షంగా ప్రకటించారు
ఈ ఏడాది సింగరేణి లాభాలు పెరిగాయి. బోనస్ కూడా పెరుగుతుందని భావించాం. బోనస్‌పై కార్మిక సంఘాలతో చర్చించాలని కోరాం. మా వినతిని ప్రభుత్వం పట్టించుకోలేదు. సింగరేణిలో నిరుడు అభివృద్ధి కోసమంటూ పక్కకు పెట్టిన రూ.2289 కోట్లు.. ఏ అభివృద్ధి కోసం ఖర్చు చేశారు. ప్రస్తుతం పక్కకు పెట్టిన రూ.4,034 కోట్లు వేటి కోసం ఖర్చు పెడుతారో స్పష్టతనివ్వాలి.
-వాసిరెడ్డి సీతారామయ్య, గుర్తింపు సంఘం(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి
కొండను తవ్వి ఎలుకను పట్టారు
2024-25 ఆర్థిక సంవత్సరం లాభాల వాటా ప్రకటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉన్నది. కేవలం రూ.802.40కోట్లు కార్మికుల చెల్లింపుగా ప్రకటించారు. ఈ ప్రకటన కార్మికులను నిరాశ కల్పించింది. వాస్తవ లాభాలు దాచి పెట్టి, ఇన్ని రోజులు కార్మికులను, కార్మిక సంఘాలను ఆందోళన బాట పట్టించి, చివరకు ప్రభుత్వ జోక్యంతో కార్మికులను మరోసారి మోసం చేయడానికి కారణమైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను కార్మికులు నిదీయాలి.
– తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు