Congress | భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘ఏం చేసిందమ్మా.. కాంగ్రెస్ ప్రభుత్వం. పింఛన్లు లేవు.. ఏమీ లేవు. బస్సుల్లో అంతా ఆడోళ్లే ఎక్కుతున్నారు’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పండ్ల వ్యాపారి గౌరమ్మ వాపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై సాంస్కృతిక కళాకారులు ప్రచారం రథంతో కొత్తగూడెం బస్టాండ్ వద్ద గురువారం ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అక్కడే పండ్లు విక్రయించే గౌరమ్మ వారితో వాగ్వాదానికి దిగింది. ‘ఓటు ఎందుకు వేశావు’ అని కళాకారులు ప్రశ్నించగా.. ‘ఓటు వేసి తప్పు చేశాను’ అని చెంపలేసుకుంది. ‘అదే కేసీఆర్ ఉంటే.. అన్నీ ఇచ్చేవారు’ అని చెప్పింది.
అక్కడున్న ఆమెను ఎందుకమ్మ అట్లా అన్నావు అని అడిగితే.. నాకు ఇబ్బంది అయింది. అందుకే అన్నానని చెప్పింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఆమె మాటలు వైరల్ అయ్యాయి. వృద్ధురాలు నోటి వెంట కేసీఆర్ పేరు రావడంతో అందరూ ఆలోచనలో పడ్డారు.