Telangana | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లెందు మండలం జగదాంబ గుంపు సమీపంలో జర్నలిస్టు నిట్టా సుదర్శన్(ఆదాబ్ రిపోర్టర్)పై గురువారం రాత్రి కొంతమంది దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో కాపుకాసి మారణాయుధాలతో తీవ్రంగా దాడి చేశారు.
దాడి గురించి సమాచారం అందగానే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. రక్తపు మడుగులో పడి ఉన్న సుదర్శన్‌ను సీఐ బత్తుల సత్యనారాయణ ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనపై వంశీ, ప్రేమ్ మరికొందరు దాడి చేసినట్లు నిట్ట సుదర్శన్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
కాగా, ఇల్లెందుకు చెందిన పలువురు రౌడీ షీటర్లు, నాయకులతో తనకు ప్రాణహాని ఉందని నిట్ట సుదర్శన్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.