మేడ్చల్, అక్టోబరు 15 : ‘గొప్ప కలలు కనండి, సాకారానికి కృషి చేయండి. కలలు లేకుంటే జీవితమే లేదు’ అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులకు సందేశమిచ్చారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీలో గూగుల్ ఇండియా.. మల్లారెడ్డి యూనివర్సిటీతో కలిసి ఏర్పాటు చేసిన అతిపెద్ద క్లౌడ్ డిజిటల్ క్యాంపస్‌ను బుధవారం ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ ప్రారంభించారు. మల్లారెడ్డి విద్యా సంస్థల వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే మల్లారెడ్డి, గూగుల్ సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో వేడుక జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని చెప్పారు. యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, దేశ ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మల్లారెడ్డి విద్యా సంస్థల వ్యవస్థాపకుడు మల్లారెడ్డిని ఆదర్శంగా తీసుకొని, గొప్పగా కలలు కనాలని సూచించారు. మల్లారెడ్డి కలలను సాకారం చేసుకునేందుకు చేసిన ఉన్నతమైన కృషి కారణంగా నేడు వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విద్యా సంస్థలను స్థాపించ గలిగారని చెప్పారు.
ఆయనలో కనిపిస్తున్న జోషే.. ఈ విజయానికి కారణంగా కన్పిస్తున్నదని చెప్పారు. దివంగత ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రి జై జవాన్, జై కిసాన్ అంటే, ప్రధాని వాజ్‌పేయి జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అన్నారని, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ.. వాటికి జై అనునంధాన్ చేర్చారని చెప్పారు. గూగుల్ ఇండియాతో కలిసి మల్లారెడ్డి యూనివర్సిటీలో అతి పెద్ద డిజిటల్ క్యాంపస్‌ను ప్రారంభించడం అనుసంధానంలో భాగమేనని వివరించారు. విద్యార్థులు, యువత కలలు సాకారం చేసుకునేందుకు గూగుల్ సంస్థ కృషి చేయడం హర్షనీయమని తెలిపా రు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉన్నదని, ఇక్కడికి తరలివచ్చిన వేలాది మంది విద్యార్థులు యువతలో దేశ ఉన్నత భవిష్యత్తు కన్పిస్తుందని చెప్పారు. ఇదో ఒకటి సాధిస్తారన్న నమ్మకం కలుగుతుందని వివరించారు. దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి జరగాలని తెలిపారు. గ్రామీణ ప్రాం తాల్లోని విద్యార్థులకు, యువతకు ఉన్నత విద్యను అందిస్తే దేశం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి నైపుణ్యాలు, సాంకేతికతను అనుసంధానం చేసే దిశగా కృషి చేస్తున్నారని కొనియాడారు. వేడుకలో పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రపంచాన్ని సాంకేతికత, నైపుణ్యాలు శాసిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారని, వాటిని వినియోగించుకుంటున్న దేశాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నారని చెప్పారు. గూగుల్ ఇండియాతో కలిసి యూనివర్సిటీలో అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తంచేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను ప్రపంచ శ్రేణి ఇంజినీర్లుగా తీర్చిదిద్దమే తన లక్ష్యమని చెప్పారు. పూలు అమ్మి, పాలు అమ్మి తాను దేశంలోనే అతి పెద్ద విద్యా సంస్థలను స్థాపిస్తే… యువ ఇంజినీర్లు ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని సూచించారు. వేలాది మంది విద్యార్థుల హర్షద్వానాల మధ్య 50వేల బెలూన్లను గాలిలో వదిలి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎమ్మెల్యే మల్లారెడ్డి డిజిటల్ క్యాంపస్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో గూగల్ ఇండియా హెడ్ వైభవ్‌కుమార్ శ్రీవాస్తవ్, గూగుల్ ఎడ్యుకేషన్ ఇండియా హెడ్ సంజయ్ జైన్, దక్షిణ భారత హెడ్ సిద్ధార్థ్ దల్వాడీ, గూగుల్ స్పేస్ స్పెషలిస్ట్ కరణ్ తల్వార్, యూనివర్సిటీ చాన్స్‌లర్ కల్పనారెడ్డి, వైస్ చాన్స్‌లర్ వీఎస్కే రెడ్డి, మల్లారెడ్డి విద్యాపీఠ్, మెడికల్ సైన్సెస్ చైర్మన్ భద్రారెడ్డి, వైస్ చైర్పర్సన్ ప్రీతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.