హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : మూసీ పేరుతో లక్షన్నరకోట్ల ప్రజాధనం దోచుకుంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం, మూసీ సుందరీకరణ అంటూ మూడు పేర్లతో మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవానికి కేటాయించిన రూ.16వేల కోట్లు సరిపోతాయని, ఎస్టిమేషన్ పెరిగితే రూ.25 వేల కోట్లు అవుతుందని అన్నారు. ఎంపీ చామలకు కనీస అవగాహన లేదని, నల్లగొండ జిల్లా ప్రజలను ఆయన చైతన్యం చేయడం ఏమిటి? అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో నల్లగొండ రైతులు బాగుపడ్డారని, కాంగ్రెస్ పాలకులు మళ్లీ వారిని వలసలు వెళ్లేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రామన్నపేటలో తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని నిలుపుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమ వస్తే ఎనిమిది గ్రామాల ప్రజల జీవనం దెబ్బతింటుందని, 4 వేల ఎకరాలు పడావుపడతాయని ఆందోళన వ్యక్తంచేశారు. అంబుజా ఫ్యాక్టరీ ఏర్పాటుపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, సుందరీకరణ పేరుతో దోచుకోవాలని చూస్తే ఎక్కడికక్కడ ఎండగడతామని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్టీపీలు పెట్టామని, అవి సరిపోకపోతే మరిన్ని ఏర్పాటుచేసి మూసీ జలాలను శుద్ధి చేయాలని అన్నారు.