హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): అధికారంలో ఉన్నా, లేకపోయినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలో సోమవారం ఒక మీడియా చానల్‌తో మాట్లాడిన ఆయన.. పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని కొనియాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని ఎంపీ వివరించారు.
తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 35 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులకు పెరిగిందని తెలిపారు. రైతుకు భరోసా కలించేలా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు పథకాలతో రైతాంగానికి గత ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందని చెప్పారు.
రేవంత్‌రెడ్డి పాలనలో మకజొన్న, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారుల బారిన పడి దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నాణ్యమైన విద్యుత్తు లేక, కేవలం 8 గంటల సరఫరాతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు లేకపోవడం, కాళేశ్వరం నీటిని వృథా చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ముందస్తు ప్రణాళిక లేకనే యూరియా, డీఏపీ ఎరువుల కొరత నెలకొందని ఆరోపించారు.
రైతులు, ప్రజలు ఎదురొంటున్న సమస్యలను, కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు ఇచ్చిన అలవికాని హామీలను, వారి వైఫల్యాలను పార్లమెంట్ వేదికగా ఎండగడతామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనకి తగ్గేది లేదని రవిచంద్ర తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా లక్ష్యంగా ముందుకెళ్తామని స్పష్టంచేశారు. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించి, సుమారు 6 వేల మందికి ఉపాధి కల్పించే వరకు పోరాటం ఆగదని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని కోరారు.