హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం వివిధ శాఖల అధికారులతో డీజీపీ సమీక్షించారు. సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన అనంతరం, ఉదయం 11 గంటలకు గోలొండలో జాతీయ పతాకావిషరణ చేస్తారని డీజీపీ తెలిపారు.
14 పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు, వేడుకల ప్రత్యక్ష ప్రసారం కోసం 10 కెమెరా యూనిట్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, ఐఅండ్‌పీఆర్ ప్రత్యేక కమిషనర్ అశోక్‌రెడ్డి, జలమండలి ఎండీ దాన కిశోర్, విద్యుత్తుశాఖ, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.
సచివాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. సచివాలయంలో పతాక ఆవిష్కరణ ఏర్పాట్లను శుక్రవారం జీఏడీ, పోలీసు అధికారులతో కలిసి ఆమె పర్యవేక్షించారు. జీఏడీ అధికారులకు, పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.