వేంసూరు, మార్చి 30: వర్షాలతో సంబంధం లేకుండా ఖమ్మంజిల్లా రైతులు జూన్‌లో గోదావరి జలాలతో సాగు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో మంత్రి తుమ్మల ఆయిల్‌పాం నూతన కర్మాగార పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలతో సంబంధం లేకుండా ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందేలా సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అందుకుగాను ఎత్తిపోతల పెండింగ్ పనులకు సంబంధించి అంచనాలను సీఎం ఆమోదించినట్టు తెలిపారు.