Mallanna Sagar | తొగుట/మర్కూక్, ఆగస్టు 8: మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి మళ్లీ గోదావరి పరవళ్లు మొదలయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కృషితో కాళేశ్వరం నీళ్లు కదిలొచ్చాయి. ఇటీవలె బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఆలోచనను పక్కన పెట్టాలని.. కాళేశ్వరం జలాలను పంపింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికీ లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి నీటి విడుదల చేయకుంటే 50వేల మంది రైతులతో వచ్చి తామే మోటర్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా రాజకీయాలు కాకుండా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రంగనాయకసాగర్, మల్లన్న సాగర్‌లోకి నీటిని విడుదల చేయాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు.
ఆ వెంటనే మల్లన్నసాగర్‌కు నీటిని విడుదల చేస్తామని సాగునీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా ప్రకటించారు. లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలు అనంతరగిరి రిజర్వాయర్, రంగనాయకసాగర్‌కు చేరుకున్నాయి. గురువారం తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి అధికారులు నాలుగు పంపులను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో పంప్ నుంచి 0.432 టీఎంసీల నీటిని మల్లన్నసాగర్‌లోకి పంపిస్తున్నారు. అలాగే మల్లన్నసాగర్ నుంచి గురువారం ఒక మోటరును ఆన్ చేయడంతో గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌లోకి పరుగులు పెట్టాయి.
కాళేశ్వరం పనికిరాదు అన్నారు కానీ అదే కాళేశ్వరం వాడక తప్పని పరిస్థితి
రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుండి మల్లన సాగర్ రిజర్వాయర్‌కు కాళేశ్వరం నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు pic.twitter.com/04S4nyyTUe
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2024