భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. శనివారం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.4 అడుగులకు చేరింది. దీంతో స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటిమట్టం మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.
కాగా, దుమ్ముగూడం మండలం పర్ణశాల వద్ద పర్యాటక ప్రదేశం నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. దీంతో పర్యాటకులను ఆపివేశారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.