భద్రాచలం: ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. భారీగా వరద వస్తుండటంతో ఉదయం 7 గంటలకు 51.20 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టిన గోదావరితో వరద మళ్లీ పెరిగింది. ప్రస్తుతం 13,31,102 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది.
భారీగా వరద వస్తుండటంతో రామాలయం పడమరమెట్ల వద్ద నీరుచేరింది. ఆలయ దుకాణాలు నీటమునిగాయి. అన్నదాన సత్రంలోకి వరద నీరుచేరడంతో భక్తులకు అన్నదానం నిలిపివేశారు. ఇక భద్రాచలంలోని కొత్త కాలనీ, అయప్ప కాలనీ ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.