Rafale Fighter Jets : ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) సమయంలో పాకిస్థాన్ (Pakistan) కు వణుకు పుట్టించిన రఫేల్ యుద్ధ విమానాల (Rafale fighter jets) సంఖ్య మరింత పెంచుకోవాలని భారత్ భావిస్తున్నది. అందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాల కొనుగోలు విషయమై రక్షణ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పింది.
రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్‌తో అతిపెద్ద రక్షణ ఒప్పందం చేసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా డీల్‌కు ఆమోదం లభించడం గమనార్హం.
ఈ 114 రఫేల్ యుద్ధ విమానాల్లో 88 సింగిల్ సీటర్, 26 ట్విన్ సీటర్ వేరియంట్లు ఉన్నాయి. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, అసెంబ్లింగ్ వంటి వాటి కోసం ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్.. భారత్‌లోని ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. కాగా భారత వాయుసేన దగ్గర ఇప్పటికే 36 రఫేల్ యుద్ధవిమానాలు ఉన్నాయి.