Ghooskhor Pandat | మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఘూస్ఖోర్ పండత్’ (Ghooskhor Pandat) సినిమా టైటిల్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దానిని తక్షణమే మార్చాలని నిర్మాతలను ఆదేశించింది. మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్రలో నీరజ్ పాండే, రితేశ్ షా సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలుకాగా.. ఈ పిటిషన్ని విచారించిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ, వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని, సమాజంలో ఇప్పటికే ఉన్న విభేదాలను ఇలాంటి టైటిళ్లతో మరింత పెంచవద్దని ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘పండత్’ అనే పదానికి ‘ఘూస్ఖోర్’ (అవినీతిపరుడు) అనే పదాన్ని చేర్చడం వల్ల బ్రాహ్మణ సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతింటున్నాయని దాఖలైన పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, కొత్త పేరును ఖరారు చేసి అఫిడవిట్ దాఖలు చేసే వరకు సినిమా విడుదలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ స్టే విధించింది. దీనిపై స్పందించిన నెట్ఫ్లిక్స్ మరియు దర్శకుడు నీరజ్ పాండే బృందం, కోర్టు ఆదేశాల మేరకు టైటిల్ను మారుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నెట్ఫ్లిక్స్ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లను తొలగించగా, తదుపరి విచారణ ఫిబ్రవరి 19న జరగనుంది.