Bhadrachalam | భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో (Godavari) వరద ఉధృతి పెరిగింది. బుధవారం రాత్రి 48 అడుగులుగా ఉన్న గోదారమ్మ నీటిమట్టం గురువారం ఉదయం 5 గంటలకు 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు 42.20 అడుగులుగా ఉన్న గోదావరి.. 8:15 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 10 గంటలకు 43.60 అడుగులు, మధ్యాహ్నం 12 గంటలకు 44.30, సాయంత్రం 3 గంటలకు 45.40, సాయంత్రం 6 గంటలకు 46.60 అడుగులకు చేరుకుంది.
ఎగువన ఓవైపు శ్రీరాంసాగర్ నుంచి, మరోవైపు చర్ల తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద చేరడంతో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో బుధవారం రాత్రి 11 గంటలకు 48.30 అడుగులు దాటి ప్రవహిస్తుండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరకుండా ఉండేలా స్లూయిజ్ మోటర్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. స్లూయిజ్ నుంచి లీకయ్యే నీటిని ఎప్పటికప్పుడు ఎత్తి మళ్లీ గోదావరిలో పోసేలా మోటర్లు సిద్ధం చేశారు.