మహదేవపూర్(కాళేశ్వరం)/వాజేడు/పలిమెల/మంగపేట/ఏటూరునాగారం, ఆగస్టు 20: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞానజ్యోతులు నీట మునిగాయి. గరిష్ఠ ప్రవాహం 13.460 మీటర్లు కాగా, ప్రస్తుతం ఉభయ నదుల ప్రవాహం 12.220 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండటంతో సీడబ్ల్యూసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీతీరంలో ఉన్న వ్యాపారుల దుకాణాలను అధికారులు ఖాళీ చేయించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి 15.910 ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి 10 గంటలకు 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద నేపథ్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ, ఐటీడీఏలోనూ కంట్రోల్ రూంలు అధికారులు ఏర్పాటు చేశారు.
జూరాలకు భారీగా వరద
గద్వాల/అయిజ/శ్రీశైలం/నందికొండ: జూరాల ప్రాజెక్టుకు ఎగువన వర్షాలు కురుస్తుండడంతో భారీగా వరద వస్తున్నది. బుధవారం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,92,000 క్యూసెక్కులు రాగా 44 గేట్లు ఎత్తి 3,22,179 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగ, భద్ర నదుల నుంచి తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 1,16,672 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి బుధవారం 4,78,032 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 10 క్రస్ట్ గేట్లను 18 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్‌కు 4,87,037 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద ఉధృతి కొనసాగుతుండడంతో డ్యాం 26 క్రస్ట్ గేట్ల ఎత్తును పెంచుకుంటూ దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి 4,87,037 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో డ్యాం 26 క్రస్ట్ గేట్లలో 12 గేట్లను 13 అడుగులు, 14 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,99,008 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే మీదుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు రెండ్రోజులకు పోటెత్తిన వరద బుధవారం కాస్త తగ్గుముఖం పట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు వరద పోటెత్తుతోంది. మహారాష్ర్టలోని ప్రాణహిత, తెలంగాణలోని గోదావరి నదితో కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్నది. మంగళవారం బరాజ్ ఇన్‌ఫ్లో 6,65,170 క్యూసెక్కుల ప్రవాహం రాగా, బుధవారం 9,89,820 క్యూసెక్కులకు పెరిగింది. మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.