హైదరాబాద్, సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో గోవాతో లింకులు బయట పడినట్టు తెలిసింది. సిట్ దర్యాప్తులో ఈ మూలాలపై ఆరా తీయడంతో గోవా నుంచి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు డ్రగ్స్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈనెల 14న మొయినాబాద్, అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై ఈగల్, స్థానిక, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో నిందితులు పోలీసులపై కాల్పులు జరపగా, పార్టీలో ఉన్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది.
ఈ ఘటనపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఆరా తీసింది. ముగ్గురు నిందితులు రోహిత్‌రెడ్డి, నమిత్ శర్మ, రితేశ్రెడ్డిలను కస్టడీలోకి తీసుకొని విచారించింది. విచారణలో అధికార పార్టీకి చెందిన యువ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఈ పార్టీకి రావాల్సి ఉండగా ఆ రోజు రాలేదని, పట్టుబడ్డ వారితో ఉన్న లింక్‌లను సిట్ సేకరించినట్టు తెలిసింది. అసలు డ్రగ్స్ నగరానికి ఎలా వచ్చిందనే కోణంలో ఆరా తీయగా, వైద్యుడైన బాలాజీ తెచ్చాడని తెలిసింది.
బాలాజీకి ఎవరు డ్రగ్స్ ఇచ్చారని సిట్ సమాచారాన్ని సేకరించడంతో గోవాలోని జేడీ క్లింటన్ ఎండీఎంఏను బాలాజీకి ఇచ్చినట్టు గుర్తించింది. దానిని బాలాజీ డ్రైవర్‌కు ఇవ్వగా అతడు ఫామ్‌హౌస్‌లోని వాచ్మెన్ కుటుంబానికి.. అక్కడి నుంచి నిర్వాహకుల చేతికి వెళ్లినట్టు సిట్ గుర్తించినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ నెట్‌వర్క్‌లో ఉన్న పలువురిని గుర్తించగా, అధికార పార్టీకి లింక్‌లు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిందితులను మరోసారి సిట్ కస్టడీలోకి తీసుకునే అవకాశాలున్నాయి.