హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కార్మికులు 8 గంటలకు బదులుగా 10 గంటలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 282 జీవోను రద్దు చేయాలని బీఆర్టీయూ డిమాండ్ చేసింది. రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ధర్నాలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, నాయకులు నారాయణ, మారయ్య, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు మంచి చేయకపోగా ఉన్న ప్రయోజనాలు, సాధించుకున్న హకులను కాలరాస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. కనీస వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్నదని వాపోయారు. ఈ ధర్నాలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ, బీఆర్టీయూ నేతలు శివశంకర్, రాముడు యాదవ్, ఎల్లమయ్య, చెన్నయ్య, రమేశ్, లక్ష్మీరెడ్డి, రవికుమార్, సాంబశివుడు, మాదవరావు, శంకర్రెడ్డి, రవిసింగ్, చారి, కిరణ్ మహేందర్, అజీజ్, మధు, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.