హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్లోనూ బాలికలే సత్తా చాటారు. 45,773 మంది బాలికలకు 40,528(88.54%) మంది బాలికలు అర్హత సాధించారు. ఇక 53,085 బాలురకు 42,836(80.69%) మంది క్వాలిఫై అయ్యారు. డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ పాలిసెట్ ఫలితాలను శనివారం మాసాట్ట్యాంక్లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. పాలిసెట్లో ఈ సారి మొత్తంగా 84.33% విద్యార్థులు అర్హత సాధించారు. 1,06,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 98,858 మంది పరీక్ష రాశారు. వీరిలో 83,364(84.33%) క్వాలిఫై అయ్యారు. విభాగాలవారీగా తీసుకుంటే ఎంపీసీలో 81.88%, ఎంబైపీసీలో 84.33% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. 120 మార్కులకు పాలిసెట్ పరీక్ష నిర్వహించగా, 36 మార్కులొస్తే క్వాలిఫై అయినట్టు లెక్క. ఎస్సీ క్యాటగిరీలో 18,039 ఎస్సీ విద్యార్థులకు 18,037, ఎస్టీ క్యాటగిరీలో 7,459 మందికి మొత్తం విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీ వారికి ఒక మార్కు వచ్చినా క్వాలిఫై అయినట్టే లెక్క. ఎస్సీ క్యాటగిరీలో ఇద్దరు విద్యార్థులు ఒక మార్కు కూడా తెచ్చుకోలేకపోయారు. జూలైలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి.
పాలిసెట్లో రెండు విభాగాలుండగా రెంటింటిలోనూ విద్యార్థులు సత్తాచాటారు. టాపర్లుగా నిలిచారు. గోరుగంటి శ్రీజ, తూమాటి లాస్యశ్రీ ఎంపీసీ, ఎంబైపీసీలో రెండింటిలోనూ మొదటి రెండు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. టాప్-8 జాబితాలో షేక్ ఇఫ్రా తస్నీమ్, వుంద్యాల కౌశిక్ నారాయణ, వీసవరం దీక్షిక, పోగుల సాత్విక ఎంపీసీ, ఎంబైపీసీలోనూ టాపర్లుగా నిలిచారు. ఎంపీసీలో టాప్-8లో ఒక్క బాలుడు ఉండగా, మిగతా ఏడుగురు బాలికలే. ఎంబైపీసీ విభాగంలో టాప్-8 ర్యాంకర్లలో ఐదుగురు బాలికలుంటే, ముగ్గురు బాలురున్నారు. నిరుటికంటే ఎంపీసీలో ఉత్తీర్ణత శాతం తగ్గగా, ఎంబైపీసీలో పెరిగింది.