హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫలితాల్లో మళ్లీ అమ్మాయిలే సత్తాచాటారు. మొదటి, ద్వితీయ సంవత్సరాలన్న తేడాల్లేకుండా రెండింటిలోనూ వారి పరంపరే కొనసాగింది. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఫలితాలు విడుదల చేశారు. బాలికలు ఫస్టియర్‌లో 73.8శాతం, సెకండియర్‌లో 77.73శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు ఫస్టియర్‌లో 59.74శాతం, సెకండియర్‌లో 64.60శాతం ఉత్తీర్ణులయ్యారు.
మొత్తంగా ఫస్టియర్‌లో 66.89శాతం, సెకండియర్‌లో 71.37శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి ఫస్టియర్, సెకండియర్‌లో ఉత్తీర్ణతశాతం పెరగడం గమనార్హం. నిరుటితో పోల్చితే సెకండియర్‌లో 5.83శాతం, ఫస్టియర్‌లో 2శాతం అధికంగా ఉత్తీర్ణతశాతం నమోదైంది. జిల్లాలవారీగా చూసుకుంటే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 77.21శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 76.36శాతంతో రంగారెడ్డి రెండోస్థానం, 70.52శాతంతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. మహబూబాబాద్ జిల్లా 48.43శాతంతో చివరిస్థానంలో నిలిచింది.
సెకండియర్ ఫలితాల్లో ములుగుజిల్లా 81.06శాతంతో మొదటి స్థానం, 80.24శాతంతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెండోస్థానంలో, 77.91శాతంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడోస్థానంలో నిలిచింది. 56.38శాతంతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. యాజమాన్యాలవారీగా ఉత్తీరతశాతం తీసుకుంటే ప్రైవేట్ కాలేజీల్లో 65.83%, సర్కారు జూనియర్ కాలేజీల్లో 53.44%, మాడల్ స్కూల్స్‌లో 62.52%, కేజీబీవీల్లో 79.1%, గురుకులాల్లో 92.9% నుంచి 81.53% ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలపై ఏవైనా అనుమానాలుంటే helpdesk-ie-telan gana.gov.in ఈ-మెయిల్‌తోపాటు 92402 05555 నంబర్‌ను సంప్రదించవచ్చు. రీ కౌం టింగ్, రీ వెరిఫికేషన్ కోసం 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫెయిలైన వారి కోసం మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. 23 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి.