హనుమకొండ : రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పారిశుధ్య పనులు లోపించి దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హనుమకొండ(Hanumakonda) జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనిత్య(12) డెంగ్యూ జ్వరంతో(Dengue) ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి(Girl died) చెందినట్లు బాలిక తల్లి సునీత తెలిపారు.
ఆమె కథనం మేరకు బాలిక తండ్రి రవి అనారోగ్యంతో ఏడాది క్రితం మృతి చెందగా వరంగల్లో నివాసం ఉంటున్నారు. అక్కడే ఓ ప్రైవేట్ పాఠశాలలో శ్రీనిత్య 5వ తరగతి చదువుతున్నది. వారం రోజులుగా జ్వరం వస్తుండగా, రెండు రోజుల క్రితం తీవ్రమవడంతో హనుమకొండలోని హాస్పిటల్లో చేర్పించగా డెంగ్యూ నిర్ధారణ జరిగింది. ఈ క్రమంలో చికిత్స అందిస్తుండగానే మంగళవారం మృతి చెందినట్లు బాలిక తల్లి తెలిపారు.