Chandrababu | ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి.. తప్ప చెత్త రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. ఈ ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా అని ప్రశ్నించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజిలో బోట్ల ఘటనపై విచారణ చేపడతామని తెలిపారు. ఎవరిదైనా పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపారు. బాబాయిని చంపి గుండెపోటు అన్నోళ్లు.. ఇవి కూడా చేస్తారని విమర్శించారు. కుట్రలను తిప్పికొట్టేలా అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. బుడమేరుకు, వరదకు ఏం సంబంధమని ప్రశ్నించారు. నిన్న వచ్చి ఐదు నిమిషాలు షో చేసి వెళ్లారని.. ఒక్క వ్యక్తికైనా ఆహార పొట్లం ఇచ్చారా అని జగన్‌పై మండిపడ్డారు.
‘ వరద ప్రభావంపై ప్రధానితో మాట్లాడినప్పుడు.. మీరు ఉన్నారు కదా భయం లేదని చెప్పారు. హుద్‌హుద్ సమయంలో నా పనితీరును ప్రధాని మెచ్చుకున్నారు. నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు.’ అని చంద్రబాబు తెలిపారు.
అధికారుల అలసత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా అధికార యంత్రాంగానికి పక్షవాతం వచ్చిందని విమర్శించారు. అధికారులు అలసత్వం వహించవవద్దని సూచించారు. జక్కంపూడిలో ఓ అధికారిపై చర్యలు తీసుకున్నామని.. ఎవరైనా పనిచేయకపోతే అలాగే వ్యవహరిస్తామని హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జీతం తీసుకుంటున్నప్పుడు అధికారులకు బాధ్యత ఉండదా? అని ప్రశ్నించారు. బాధల్లో ఉన్నప్పుడు బాధితుల ఆగ్రహం సహజమే అని అన్నారు. బాధితులను అధికారులు తమ కుటుంబ సభ్యులుగా భావించాలని చంద్రబాబు సూచించారు.