జనగామ/అలంపూర్/ జడ్చర్ల టౌన్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమాల్లో అధికారులు ప్రొటోకాల్‌ను పాతరేస్తున్నారు. చాలాచోట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా, అధికారంలేని కాంగ్రెస్ నేతలతో పంపిణీ చేయిస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కాదని ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా శనివారం క్రైస్తవులకు కానుకల పంపణీ చేశారు. అధికారుల నిబంధనల ఉల్లంఘనపై కలెక్టర్ శివలింగయ్యకు ఎమ్మెల్యే రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. పేదలకు పం చాల్సిన 950 క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను అధికారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పంచుకున్నారని ఆరోపించారు. ప్రొటోకాల్ ఇవ్వని అధికారులపై అసెంబ్లీ స్పీకర్, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో క్రిస్మస్ కానుకల పంపిణీ ఆద్యంతం కాంగ్రెస్ కార్యక్రమంగా కొనసాగింది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఫొటో, పేరు పెట్టలేదు. కార్యక్రమానికి సైతం ఆయనను ఆహ్వానించలేదు. మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఫొటో, పేరు మాత్రం ఉన్నది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై కలెక్టర్ కార్యాలయం లో ఫిర్యాదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బేతని ఎంబీ చర్చిలో నిర్వహించిన కార్యక్రమ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లో ‘తెలంగాణ (కాంగ్రెస్) ప్రభుత్వం వారిచే’ అని పేర్కొనటం చర్చనీయాంశంగా మారింది.