హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఏమి చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి ఇప్పుడు చెప్తున్నారని, ఇన్నాళ్లు ఆయనను ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
ఓయూలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్లో నిజాయితీ లేదని, చేతల్లో చిత్తశుద్ధి అంతకన్నా లేదని విమర్శించారు. తెలంగాణ విద్యార్థి లోకం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఓయూకు వెళ్లి వచ్చి ప్రపంచాన్ని జయించినట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే నిన్ననే వెయ్యి కోట్లు ప్రకటించాల్సి ఉన్నదని, కనీసం రేపు అయినా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజులు ఓయూ క్యాంపస్‌ను పోలీసుల క్యాంపస్‌గా మార్చారని విమర్శించారు.
యాదయ్య, శ్రీకాంతాచారి బలిదానానికి కారకులు నాడు రేవంత్‌రెడ్డి ఉన్న పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు కాదా? అని ప్రశ్నించారు. ఉద్యమం సమయంలో రేవంత్‌రెడ్డి ఎకడున్నారో తెలియదా? అని నిలదీశారు. సీఎం భాష, పద్ధతి నయా భూస్వామిలా ఉన్నదని విమర్శించారు. ఏపీలో నీట్ తరగతులు ప్రారంభమవుతుంటే, మన రాష్ట్రంలో కౌన్సెలింగ్ కూడా పూర్తి కాలేదని మండిపడ్డారు.
యూనివర్సిటీల భూములు అమ్ముకునే సంస్కృతి రేవంత్‌రెడ్డిదేనని, హెచ్‌సీయూలో ఏం జరిగిందో అందరికీ తెలుసని విమర్శించారు. హైడ్రా రూపంలో పేదలు, లగచర్లలో గిరిజనులను బేడీలు వేసి వేధించింది రేవంత్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. మానవీయ విలువలతో రాష్ట్రాన్ని పాలించిన మహానేత కేసీఆర్ అని పేర్కొన్నారు.
20 నెలల్లో కోటి రూపాయలు కూడా ఇవ్వని ముఖ్యమంత్రి.. వెయ్యి కోట్లు ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా?అని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఓయూకు ఉత్త చేతులతో వెళ్లి ఉత్త మాటలు మాట్లాడి వచ్చారని విమర్శించారు. డిసెంబర్ 9న సెక్యూరిటీ, కాంగ్రెస్ కార్యకర్తలు లేకుండా ఓయూకు రావాలని డిమాండ్ చేశారు. సీఎం పర్యటన పేరిట విద్యార్థులపై పోలీసులు నిర్బంధకాండ అమలు చేశారని, కాంగ్రెస్ కార్యకర్తలతో ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియం నింపారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు విమర్శించారు.