హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): పోలవరం-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విన్నవించిన ఏపీ.. తాజాగా మరోసారి పూర్తి వివరాలను కేంద్రానికి నివేదించింది. పోలవరం నుంచి బనకచర్లకు రోజూ 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల వరద జలాలను తరలించేందుకు రూ.81 వేల కోట్లతో జీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు, జల్‌శక్తి శాఖకు విన్నవించారు.
గత నెల జరిగిన భేటీల్లోనూ ప్రధానికి, ఆర్థిక మంత్రికి వివరించడంతో వారు సానుకూలత వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి వివరాలను అందజేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించడంతో ఆ వివరాలను సమర్పించేందుకు ఏపీ సిద్ధమైంది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టుపై సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేథ్‌కు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు వివరించారు.
జీబీ లింక్ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు ఒనగూరే లాభ నష్టాలను వివరించారు. కానీ, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర ముప్పు ఏర్పడనున్నది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా, పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ ప్రాజెక్టును చేపడుతున్నదని, తద్వారా తెలంగాణ జలహక్కులకు తీరని నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అయినప్పటికీ తెలంగాణ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతున్న ఏపీకి కేంద్రం మద్దతు ఇస్తున్నది.