కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 28 : నాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పరిధిలోని అల్గునూర్‌లో శుక్రవారం చేపట్టనున్న దీక్షాదివస్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటుతర్వాత 24 గంటల కరెంటు, భూమికి బరువయ్యేంత ధాన్యం పడిందని అన్నారు. కేసీఆర్ అరస్టైన స్థలాన్ని తాము పవిత్రంగా భావిస్తున్నామని తెలిపారు. అక్కడే దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ముఖ్యఅతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్టు తెలిపారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి, నవంబర్ 28: కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలు, నిర్బంధాలు, కూల్చివేతలు, పేల్చివేతలు జరుగుతున్నాయని, ఇందిరమ్మ రాజ్యమంటే ఇట్లనే ఉంటదా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇది ప్రజా పాలన కాదు, రాక్షస పాలన అని మండిపడ్డారు. గురువారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ భూములు పాడిపంటలతో కళకళలాడితే, రేవంత్‌రెడ్డి వచ్చాక అగ్నిమంటలతో కాలిపోతూ కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, బీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి ఆయేషా ఫాతిమా, రాంకిషన్‌రావు, సుజీత్‌సింగ్, ప్రభాకర్, సత్యప్రకాశ్ పాల్గొన్నారు.