హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోక్సో కేసు విషయంలో చట్టానికి సహకరించాల్సింది పోయి.. వాస్తవాలు బట్టబయలు చేసిన బీఆర్ఎస్ నేతలను అంతుచూస్తామని బెదిరించడం దుర్మార్గమని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. బాలికపై అఘాయిత్యం అంశాన్ని కులానికి ఆపాదించడం దురదృష్టకరమని, ఇది కులాలు, పార్టీల సమస్య కాదని శాంతిభద్రతల వ్యవహారమని స్పష్టంచేశారు.
బుధవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ నేత రవీందర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఆందోళనలతోనే ప్రభుత్వం, పోలీసులు దిగొచ్చి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు చేశారని చెప్పారు. కానీ చట్టానికి, పోలీసులకు సహకరించాల్సిన బండి సంజయ్ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
మహిళలకు 33శాతం కోటా ఇస్తే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని మొసలికన్నీళ్లు కారుస్తున్న ప్రధాని మోదీ.. తెలంగాణకు వచ్చి బండి సంజయ్ కొడుకు చేతిలో మోసపోయిన బాలిక పక్షాన ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి సత్యవత్ రాథోడ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన తర్వాత బండి సంజయ్‌ని సభలో తన పక్కన కూర్చోబెట్టుకోవడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సహచర మంత్రి కొడుకుపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలను ప్రధాని తెలియనట్టు నటించడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సమస్యపై స్పందించకుండా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఇండ్లకు వెళ్లి రాజకీయాలు మాట్లాడటం బాధాకరమన్నారు.
కొడుకును అదుపులో పెట్టుకోవడంలో విఫలమైన బండి సంజయ్, కొడుకు బాగోతాలను బయటపెట్టిన వారిని అంతుచూస్తానని బెదిరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇక బాధితురాలికి తక్షణ న్యాయం చేయాల్సిన రాష్ట్ర హోం మంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బండి కొడుకును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మోదీ హైదరాబాద్ వచ్చి సభకు వచ్చిన వారిని చూసి తెలంగాణలో అధికారంలోకి వస్తున్నామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో మోదీ సభలు పెట్టినా కేసీఆర్, బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.
మొన్న వరంగల్‌లో పరుషంగా మాట్లాడారని కేటీఆర్‌పై కేసు పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల అంతుచూస్తానని బెదిరించిన బండి సంజయ్‌పై కేసేందుకు నమోదు చేయలేదని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రశ్నించారు. అంటే కేటీఆర్‌కో న్యాయం? బండి సంజయ్‌కో న్యాయమా? అని సూటిగా నిలదీశారు. వీరి కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని చెప్పారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను సైకిల్ పార్టీ, బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చారని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, అక్రమ కేసులు పెట్టినా ప్రజాసమస్యలపై పోరాటం ఆపేది లేదని కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ అభివృద్ధిని గాలికొదిలేసిన ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్ను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ, తనతో కలువాలని సీఎం రేవంత్‌రెడ్డికి పిలుపునివ్వడం చూస్తే రెండు పార్టీలు ఒక్కటేననే విషయం తెలిసిపోతున్నదని చెప్పారు. అసలు తెలంగాణను పరిపాలిస్తున్నది బీజేపీనా? కాంగ్రెస్ పార్టీనా? అర్థంకావడం లేదని దెప్పిపొడిచారు. బండి కొడుకు పోక్సో కేసుపై సిట్ వేసిన ప్రభుత్వం.. భవిష్యత్‌లో అన్ని పోక్సో కేసులపై సిట్ వేస్తుందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, కరీంనగర్లో నగల షాపులో దొంగతనం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులపై దాడి చేసినా నిందితులపై పోలీసులు చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్‌పై పరుష పదజాలంతో విమర్శలకు దిగిన బండి సంజయ్‌కి తనదాకా వస్తే కానీ బాధలు అర్థంకాలేదని దెప్పిపొడిచారు. బీజేపీకి దమ్ముంటే కాంగ్రెస్ గడీలు బద్దలుకొట్టాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ను దూషిస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా సోయి మరచి మాట్లాడవద్దని హితవు పలికారు.