హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పౌరసరఫరాల శాఖలో జరిగిన కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ‘ఈ కుంభకోణంలో.. టెండర్ ఒప్పందం కంటే అదనంగా మిల్లర్ల నుంచి బిడ్డర్ల ఖాతాలోకి రూ.423 కోట్ల మేర బ్యాంకు లావాదేవీలు జరిగాయి. ఆ డబ్బులు ఏమయ్యాయి? ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పి తీరాలి’ అని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ శాఖలో జరిగిన కుంభకోణం, మనీ లాండరింగ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)తోపాటు సీబీఐ వంటి విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నామని, అందుకోసం సోమవారం ఢిల్లీకి వెళ్తున్నామని గంగుల కమలాకర్ తెలిపారు. ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టంచేశారు. ఈ కుంభకోణం నిగ్గు తేల్చడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పారు.
సివిల్ సప్లయ్‌లో 38 లక్షల టన్నుల ధాన్యం అమ్మి, వాటి ద్వారా రూ.7,600 కోట్లు సమకూర్చుకోవడానికి గత ఏడాది జనవరిలో టెండర్లు పిలిచారని, అందుకోసం 90 రోజులు గడువు విధించారని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గడువు ముగిసినప్పటికీ, బిడ్డర్లకు గడువు మీద గడువు పొడిగిస్తున్నారే తప్ప ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. కుంభకోణంపై హైకోర్టులో పిల్ దాఖలు చేయగా, ప్రభుత్వం విచారణకు రావడం లేదని, ఇప్పటికే 15సార్లు గడువు కోరిందని తెలిపారు. ఈ కుంభకోణంలో భాగంగా కాంట్రాక్టర్లు దాదాపు రూ.1,000 కోట్ల వరకు ప్రభుత్వ పెద్దలకు ముడుపుల రూపంలో అందజేశారని ఆరోపించారు. మొత్తం 38 లక్షల టన్నుల ధాన్యంలో.. ఇప్పటివరకు సగమే విక్రయించారని, గడువు ముగిసినా.. ఆ టెండర్లను రద్దు చేయలేదని విమర్శించారు. అక్రమంగా జరిగిన లావాదేవీల ద్వారా వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమచేయని బిడ్డర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, వారిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు.
సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన కుంభకోణంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని గంగుల కమలాకర్ ఆరోపించారు. ఇందులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి సంబంధాలు ఉన్నప్పటికీ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు నోరు మూసుకున్నారని నిలదీశారు. రాష్ట్రంలో, దేశంలో ఎన్ని విచారణ సంస్థలు ఉన్నాయో.. వాటన్నింటికీ ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని, రాష్ట్ర సంపదను కాపాడే బాధ్యత కూడా బీఆర్ఎస్దేనని పేర్కొన్నారు.
సివిల్ సప్లయ్‌లో జరిగిన అవినీతి, కుంభకోణాలు, అక్రమాలను కక్కిస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. ఈ కుంభకోణంలో దాదాపు రూ.423 కోట్లు టెండర్ ఒప్పందం కంటే అదనంగా లావాదేవీలు జరిగాయనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని స్పష్టంచేశారు. ఈ విషయంలో ఏసీబీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఏ ఆధారాలు ఉన్నాయని ఫార్ములా-ఈ కార్ రేసులో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదుచేసిందని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. క్విడ్‌ప్రోకోకు స్పష్టమైన ఉదాహరణ ఈ కేసు అని పేర్కొన్నారు. ఈ కేసు నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పించుకోలేరని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ తప్పు చేయకపోతే.. హైకోర్టులో ఎందుకు కౌంటర్ దాఖలు చేయడం లేదని, బీజేపీ నేతలు ఎందుకు నోరు మూసుకున్నారని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, నోముల భగత్, మాజీ కార్పోరేషన్ ,ఐర్మన్ వై సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.