నేడు కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి, తెలంగాణ నేలకు బొడ్డుపేగు బంధమున్నది. ఈ నేలపై ఎగిసిన ఉద్యమాల్లో సాయుధ తిరుగుబాట్ల కాలమే ఎక్కువ. 200 ఏండ్లకు పైగా నిజాం పాలనలో ‘బాంచెన్ దొరా!’ అంటూ భూస్వాముల దౌర్జన్యాల మధ్య తెలంగాణ అరిగోస పడింది. ఆ నిజాంను ఎదిరించి పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణ పీకపై ఆంధ్రుల పెత్తనం వచ్చింది. ఆ పీడ వదిలేందుకు జనం చావో రేవో అనేదాకా వెళ్లారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు స్వీయ పాలన రుచి తెలియకుండానే తెలంగాణ తరాలు భూమిలో కలిసిపోయాయి. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన పోరు చరిత్రాత్మకమైనది. అది ఎన్నో అధ్యాయాలతో కూడిన గ్రంథం లాంటిది. విప్లవమంటూ తుపాకీ పట్టినవారు కూడా మరో చేతితో పిడికిలెత్తి ‘జై తెలంగాణ’ అంటూ ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రజల ఆకాంక్షను మించిన లక్ష్యం లేదని తోడు నిలిచారు. తెలుగు సమాజంలోని విప్లవ సానుభూతిపరులు తెలంగాణ కావాలని మొదలైన ఉద్యమాలతో మమేకమయ్యారు. ఉద్యమాన్ని వివిధ రూపాల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీరి తోడ్పాటు పనికొచ్చింది. సాహిత్య, సాంస్కృతిక కళారూపాల్లో ఉద్యమం అవసరం అని తెలిపేందుకు వీరి ఆట, పాట అడుగులేసింది. విప్లవ పాటలు పాడే బృందాలు ఉద్యమంలో ఉర్రూతలూగించాయి.
2009లో ఆనాటి మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ ఒక పత్రికకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని, దానిలోంచి హైదరాబాద్‌ను విడదీసే కుట్ర చేయవద్దని అన్నారు. అంతేకాకుండా ఇది ఆ ప్రజల 50 ఏండ్ల తీరని కోరిక, వారి బతుకులతో పాటు, భాషా సంస్కృతుల సంరక్షణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సాధ్యపడుతుందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో ఎగిసిపడిన తొలి ఉద్యమంతోనే రాష్ట్ర సాధన సాధ్యమై ఉంటే అసలు తెలంగాణలో నక్సలైట్ ఉద్యమమే పుట్టేది కాదేమో!
కాంగ్రెస్ చేసిన ద్రోహం యువత ఆగ్రహానికి ఆజ్యం అయింది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా పోలీసులను ఎగదోసి 369 మంది ప్రాణాలను బలిగొన్న దాష్ఠీకం తెలంగాణ బిడ్డలను మరో పోరుబాట వైపు చూసేలా చేసింది. చదివినా ఉద్యోగాలు రాని దశలో, ఇక రాష్ట్రం రాదనే నైరాశ్యంలో చిక్కుకున్న తెలంగాణ యువత నక్సలైట్ సిద్ధాంతానికి ఆకర్షితమైంది. తొలి ఉద్యమంలో పాల్గొన్న 20 ఏండ్ల లోపు యువకులు కొందరు తెలంగాణలో నక్సలైట్ ఉద్యమానికి ద్వారాలు తెరిచారు. ఉత్తర తెలంగాణలోని గ్రామాల్లో ఆ ఉద్యమ నిర్మాణానికి వారు కార్యకర్తలయ్యారు. అలా సాయుధ మార్గంలోకి వెళ్లిన ఒక్కొక్కరు సుమారు 40, 50 ఏండ్ల తమ జీవితాన్ని ఆ పోరు బాటకే అర్పించారు. అదే సిద్ధాంతాన్ని నమ్మి అడవిలో జీవనం గడిపారు. ఇప్పుడు కేంద్ర బలగాలు వెతికి, వేటాడి చంపుతుంటే.. చచ్చేవారు చస్తున్నారు, లొంగుబాట దొరికినవారు బతికిపోతున్నారు.
1970 దశకంలో నక్సలైట్లుగా మారిన తెలంగాణ బిడ్డలు సుమారు 50 ఏండ్లుగా సాగుతున్న ఈ పోరుకు సారథ్యం వహిస్తున్నారు. చివరి దశలో దండకారణ్యం కేంద్రంగా సాగిన మావోయిస్టు ఉద్యమంలో స్థానిక గిరిజన యువత సైన్యం కాగా నాయక స్థాయిలో మాత్రం తెలంగాణకు చెందిన సీనియర్లే ఉన్నట్టు తెలుస్తున్నది. జగిత్యాల జిల్లా, బీర్పూర్ గ్రామానికి చెందిన ముప్పాళ లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి సెక్రటరీ జనరల్‌గా 2018 దాకా కొనసాగారు. ఇంకా అజ్ఞాతంలోనే ఉన్న ఆయన వయసు 76 ఏండ్ల్లు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరిగా ఉండేవారు. ఈయన 2011లో పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయారు. వీరిద్దరూ తొలితరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు ఆనాటి వారి సన్నిహితులు చెప్తుంటారు.
1969లోనే తెలంగాణ సాధ్యపడి ఉంటే గణపతి తన టీచర్ ఉద్యోగాన్ని వదిలి పెట్టేవారు కాదేమో! అదే విధంగా కిషన్ జీ న్యాయ విద్యను మధ్యలో వదిలేయకుండా పూర్తి చేసి మంచి వకీలుగా మారేవారేమో! ఇలా 1969లో తెలంగాణకు జరిగిన నష్టం ఆనాటి ఒక తరాన్ని అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు.
అజ్ఞాత మావోయిస్టుల మద్దతే కాకుండా కాలక్రమంగా జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లలో చాలామంది మలి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. వారి ఉద్యమ జీవితం, ఉద్యమం నడిపిన అనుభవం, నాయకత్వ పటిమ తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చాయి. నక్సలైట్ ఉద్యమానికి సాంస్కృతిక సేనానిగా పనిచేసిన గద్దర్ 2010లో తెలంగాణ ప్రజాఫ్రంట్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. తెలంగాణ సాధనకు పనిచేస్తున్న అన్ని సంఘాలను ఏకం చేయడమే ఫ్రంట్ లక్ష్యం అని ఆయన చెప్పారు. విప్లవోద్యమాన్ని వదిలేసి వచ్చినవారు రాష్ట్ర సాధనలో పాల్గొని, కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి పాలనలోనూ భాగమయ్యారు. కొందరు ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగారు. కేసీఆర్ ప్రభుత్వంలో పలువురు ‘మాజీ’లకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి స్థాయి పదవులు కూడా లభించాయి.
చిన్న రాష్ర్టాల ఏర్పాటుకు మావోయిస్టుల మద్దతుపై రకరకాల కథనాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల అణచివేతను తట్టుకోలేక 2012 నాటికి మావోయిస్టులు తెలుగునేలను వదిలేశారు. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా అడవిలో బతుకులీడుస్తున్న తమకు కొత్తగా వచ్చే తెలంగాణ రాష్ట్రం మళ్లీ ఆశ్రయం ఇస్తుందని వారు ఆశించారని, ఎప్పటిలా తమ ఉద్యమాన్ని పునర్నిర్మించుకోవచ్చని అనుకున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణను విడదీస్తే ఇక్కడ మళ్లీ నక్సల్ సమస్య మొదలవుతుందని 2012-14లో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న సుశీల్‌కుమార్ షిండే అన్నారు. 2010లో వచ్చిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఇక్కడ మళ్లీ వామపక్ష తీవ్రవాదం విచ్చుకుంటుందని రిపోర్టులో పేర్కొన్నది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు ఉద్యమాల అవసరమే రాలేదు. కొందరు వాదించినట్టుగా ప్రజలు నక్సల్ ఉద్యమం దిశగా దృష్టి పెట్టలేదు.
పోరుగడ్డ తెలంగాణ ప్రజలు రాష్ట్రం సాధించుకున్నారు. పరిస్థితులు అనుకూలించక లొంగిపోతున్నట్టు చెప్తున్న మావోయిస్టులు ప్రజలకు ఏదో ఒక రూపంలో తోడుంటామని అంటున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణకు వారి అవసరం ఉన్నది. తొలి దశ ఉద్యమం.. వారికి ప్రజాజీవన ప్రస్థానం నేర్పితే సాకారమైన తెలంగాణ రాష్ట్రం..వారికి తోడు నిలువాలి. ఆయుధాలు వద్దు అంటున్న వారికి పునరావాస హామీ ఇవ్వాలి. వారు సామాన్యుల, కష్టజీవుల బతుకు మార్చాలని అనుకున్నారు. తెలంగాణ వారి ఇల్లు, వారు మనతోనే ఉండేలా ప్రభుత్వం సాయపడాలి.
– బద్రి నర్సన్