‘Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అయితే సినిమా విజయోత్సాహం మధ్య ఓ వివాదం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమాలో జాన్వీ పాత్రకు అవసరానికి మించి గ్లామర్ ట్రీట్మెంట్ ఇచ్చారని, కొన్ని సన్నివేశాల్లో ఆమె వ్యక్తిత్వం కంటే శరీర సౌందర్యానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కెమెరా యాంగిల్స్, కొన్ని విజువల్స్ మహిళా పాత్రను కేవలం గ్లామర్ కోణంలోనే ప్రెజెంట్ చేశాయంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదంపై తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి, పార్లమెంట్ సభ్యురాలు జయా బచ్చన్ స్పందించారు. సినిమాల్లో మహిళలను కేవలం ఆకర్షణీయ వస్తువులుగా చూపించే ధోరణిని ఆమె తీవ్రంగా తప్పుబట్టినట్లు తెలుస్తుంది. నటీమణులు ఇలాంటి సందర్భాల్లో షూటింగ్ సమయంలోనే తమ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణంలోని ఓ సంఘటనను కూడా ఆమె ప్రస్తావించినట్లు కథనాలు చెబుతున్నాయి. తన కెరీర్లో ఒక సందర్భంలో ఓ దర్శకుడు తన పాత్రను మరింత గ్లామరస్‌గా చూపించాలని ప్రయత్నించగా, తాను అంగీకరించలేదని, ఆ విషయంలో రాజీ పడలేదని పేర్కొన్నట్లు సమాచారం. పాత్రకు అవసరమైన హద్దులు ఉండాలని, నటీమణుల అభిప్రాయాలను కూడా గౌరవించాలని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఇక ఈ చర్చలో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ పేరు కూడా వినిపిస్తోంది. తెరపై భావోద్వేగాలు లేదా శృంగార భావాలను వ్యక్తపరచడానికి కేవలం పొట్టి దుస్తులు లేదా గ్లామర్ ప్రదర్శన మాత్రమే మార్గం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. పాత్ర బలం, నటన, కథనం ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా క్షమాపణలు కూడా తెలియజేశారు. ప్రేక్షకుల మనోభావాలను గౌరవిస్తున్నామని, అభ్యంతరాలు వ్యక్తమైన కొన్ని సన్నివేశాలపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విమర్శలు ఎదుర్కొంటున్న కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తొలగించనున్నట్లు ప్రకటించారు.