మెదక్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ) : త్వరలో కానిస్టేబుల్ నుంచి ఎస్సై,సీఐ, డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారుల బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇప్పటి నుంచే మంచి పోస్టింగ్ కోసం ఖాకీలు పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. త్వరలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని, దీంతో పెద్ద ఎత్తున పోలీసుల బదిలీలు జరుగుతాయని పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎస్సై, సీఐ స్థాయి అధికారులు ఆదాయం బాగా ఉండే ఠాణాలు, సర్కిల్లో పోస్టింగ్ దక్కేలా ప్రజాప్రతినిధులను ఆశ్రయియిస్తున్నట్లు తెలిసింది. దీనికోసం రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది.
మెదక్ జిల్లా మీదుగా పలు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. మహారాష్ట్రతో పాటు పలు జిల్లాలతో మెదక్ జిల్లాకు సరిహద్దులు ఉన్నాయి. జిల్లా గుండా ఇసుక,రేషన్‌బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. గం జాయి స్మగ్లింగ్, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. 44వ జాతీయ రహదారిపై ఉన్న రామాయంపేట, చేగుంట, నార్సింగి, తూప్రాన్, మనోహరాబాద్ పోలీసు స్టేషన్లలో ఎస్సై పోస్టింగ్‌లకు చాలామంది ఎస్సైలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పాపన్నపేట, హవేళీఘణపూర్, మెదక్ రూరల్, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం, నర్సాపూర్, శివంపేట పోలీస్స్టేషన్లలో పోస్టింగ్‌ల కోసం ఎస్సైలు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల వద్ద పైరవీలు చేస్తున్నారని తెలిసింది.
నాదేండ్-సంగారెడ్డి హైవే పైన ఉన్న అల్లాదుర్గం, పెద్దశంకరంపేట పోలీసు స్టేషన్లో పనిచేసేందుకు ఎక్కువ మంది ఎస్సైలు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఈ స్టేషన్లలో పనిచేసి సిబ్బందికి మంచి ఆదాయం సమకూరుతుండడంతో పోస్టింగ్‌లకు చాలామంది పోలీసులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఠాణాల్లో పనిచేసే ఎస్సై లు, సర్కిల్ కార్యాలయాల్లో పనిచేసే సీఐలకు వేతనం కంటే ఎన్నోరెట్లు వివిధ రూపాల్లో అక్రమార్జన ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చవద్దని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ, చాలామంది సీఐ లు, ఎస్సైలు సివిల్ కేసుల్లో తలదూరుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
భూవివాదాలు, ఇతర సెటిల్మెంట్లు చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదాయం బాగా వచ్చే ఠాణాలో ఎస్సై పోస్టింగ్ కోసం రూ.15 నుం చి రూ.20 లక్షల వరకు ముట్టజెబుతున్నట్లు తెలిసింది. సీఐలు రూ.20 నుంచి 35 లక్షల వరకు ప్రజాప్రతినిధులకు చెల్లించేందుకు ముందు కు వస్తున్నట్లు తెలిసింది. స్థానిక నాయకుల ద్వారా లోకల్ ఎమ్మెల్యే సిఫార్సుతో జిల్లా ఇన్చార్జి మంత్రిని ఆశ్రయించి , నచ్చిన చోట ఎస్సైలు, సీఐలు పోస్టింగ్‌ల కోసం జోరుగా పైరవీలు చేస్తున్నట్లు పోలీసు శాఖలో చర్చ నడుస్తున్నది. లక్షలాది రూపాయలు చెల్లించి పోస్టింగ్ పొందిన ఎస్సైలు, సీఐలు…సివిల్ వివిధాలు పరిష్కరిస్తూ అంతకు రెట్టింపు డబ్బు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇసుక, రేషన్ బియ్యం అక్రమార్కులు, మద్యం షాప్‌లు, బెల్ట్‌షాప్‌లు, దాబాలు, రెస్టారెంట్ల నుంచి భారీగా డబ్బులు వసూ లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సివిల్ విభాగంలో పని చేసేందుకు ఎస్సైలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొందరు ఎక్కువ కాలం ఒకే సర్కిల్లో పని చేయడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసులు దర్యాప్తు చేసి, బాధితులకు వేధింపులకు గురిచేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
సీఐలు ఒకే సర్కిల్లో ఎక్కువ కాలం పని చేయడంతో ఎస్‌హెచ్‌వోల పనుల్లో జోక్యం చేసుకుని బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల సేవల్లో తరిస్తూ శాంతిభద్రతలను కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కొందరు పోలీసు అధికారులపై ఆరోపణలు ఉన్నా యి. సైడ్ ఇన్‌కం ఉన్న పోలీసు స్టేషన్లో పనిచేసేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా నుంచి ఇసుక అక్రమ రవాణా, రేషన్ బియ్యం దర్జాగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌కు లారీల్లో తరలుతున్నా కేసులు నమోదు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతినెలా మామూళ్లు తీసుకొని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
మెదక్ జిల్లాలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొందరు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ శాఖకు చెడ్డపేరు తెస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల ఆదేశాలతో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారనే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేసినా చర్యలు తీసుకోవడం లేదనే బాధితులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై విచారణ చేయకుండానే పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
కొందరు ఎస్సైలు, సీఐలు అతి చేస్తున్నా, విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. ప్రతినెలా ఇసుక వ్యాపారుల నుంచి ఎస్సైలు, సీఐలు మామూళ్లు తీసుకుంటారని ఆరోపణలు వస్తున్నాయి. కల్తీ కల్లు వ్యాపారం మెదక్ జిల్లాలో ఎక్కువగా సాగుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వైన్ షాపుల నుంచి ప్రతినెలా భారీగా మూమూళ్లు తీసుకుంటున్నారని, అం దుకే బెల్టు షాప్‌లపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎస్సైలు పోలీసుస్టేషన్లో ప్రత్యేకంగా కొందరు కానిస్టేబుళ్లు, హోంగార్డులను నియమించుకోని వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. పాపన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఏడుపాయల దేవస్థానం సమీపంలో జోరుగా పేకాట అడుతున్నా, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎస్బీ అధికారులు జిల్లా అధికారులకు నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని తెలిసింది. ఏండ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన కొంద రు ఎస్సైలు, సీఐలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు కోరుతున్నారు.