హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ) : శాసనసభలో బీసీ బిల్లు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని, కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. బీసీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది, రిజర్వేషన్ల ఫలాలు అందినప్పుడే బీసీ బిడ్డలంతా సంతోషిస్తారని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికలు, ఉద్యోగ నోటిఫికేషన్లలో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ తరుపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. సోమవారం శాసనసభలో బీసీ బిల్లుపై జరిగిన చర్చలో గంగుల మాట్లాడుతూ బిల్లులోని సవరణలు, అమలు జరగాల్సిన తీరుపై కీలక సూచనలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు మాత్రమే విజయం సాధించిందని తెలిపారు. బీహార్‌తో పాటు ఇతర రాష్ర్టాలు అశాస్త్రీయంగా చేయడం వల్ల ఆ బిల్లులను కోర్టులు కొట్టేశాయని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం బీహార్ తరహాలోనే ప్రక్రియ అనుసరిస్తున్నదని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల తీరుపై గంగుల అభ్యంతరం వ్యక్తంచేశారు. బిల్లును పార్లమెంట్‌కు పంపిస్తే న్యాయపరమైన చిక్కు లు తప్పవని హెచ్చరించారు. సర్వేకు సంబంధించి బీసీ కమిషన్ ఏమైందీ? మొదట ఇచ్చిన జీవో 26 ఏమైంది? ఆ తర్వాత జీవో 18 ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. తొలుత జీవో 29లో బీసీ కమిషన్‌ను పేర్కొని, ఆ తర్వాత జీవో 18లో ఎందుకు చేర్చలేదు? అని నిలదీశారు. రాష్ట్ర బీసీ కమిషన్ లేదా జాతీయ బీసీ కమిషన్‌కు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. జీవో 18 ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన కులగణన ప్రారంభించిన ప్రభుత్వం.. జీఏడీని ఎందుకు ఇన్వాల్వ్ చేసిందని నిలదీశారు. ఇలాంటి తప్పులు చేశారు కాబట్టే బీహార్ బిల్లును కోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. నవంబర్‌లో బుసాని వెంకటేశ్వర్లుతో డెడికేటెడ్ కమిషన్ వేస్తే ఆ కమిషన్ మార్చిలోనే నివేదిక ఇచ్చిందని, తమిళనాడులో మూడు సంవత్సరాలు జరిగిన ప్రక్రియ.. ఇక్కడ మూడు నెలల్లో ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు. జీవో 26 ద్వారా వేసిన బీసీ కమిషన్‌ను ఎందుకు కొనసాగించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శాస్త్రీయ బిల్లును పార్లమెంట్‌కు పంపించాలని కోరారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన అవసరముందని గంగుల కమలాకర్ సూచించారు. చట్టం చేసి 9వ షెడ్యూల్లో పెట్టించే బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిపై ఉందని చెప్పారు. బిల్లు పంపినం, అది రాలేదు అంటే మాత్రం వదిలేదిలేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరమైతే సీఎం రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి వెళ్తే తాను కూడా కలిసి వస్తానని, దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. పార్లమెంట్లో, సుప్రీంకోర్టులో బిల్లు ఆగకుండా ఉండాలంటే సంపూర్ణ గణాంకాలతో ప్రామాణిక నివేదిక ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో బీసీల తరపున గంగుల బలమైన వాదన వినిపించారని బీఆర్ఎస్ నేతలు ప్రశంసలు కురిపించారు.
రిజర్వేషన్ల బిల్లు ఎలాగూ అసెంబ్లీలో ఆమోదం పొందినా పార్లమెంట్లో ఆగుతుందని గంగుల కమలాకర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ బిల్లుతో సంబంధం లేకుండానే ప్రభుత్వం చేతుల్లో ఉన్న మూడు పనులు బీసీల కోసం చేయాలని కోరారు.
1. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలి.
2. బీసీల కోసం ఏటా బడ్జెట్లో రూ. 20వేల కోట్లు నిధులు పెట్టాలి.
3. బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలి.
గుంగల ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ బరాబర్ అందరం కలిసి ఢిల్లీ వెళ్దామమని చెప్పారు. అదే విధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్‌తో బీసీ కమిషన్ ద్వారా ఈ సర్వే జరిగిందని స్పష్టంచేశారు. హైకోర్టు తీర్పు తర్వాత డెడికేషన్ కమిషన్ వేశామని, ప్రక్రియ మొత్తం న్యాయబద్ధంగానే చేసినట్టు తెలిపారు.