కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 14: ధాన్యం చివరి గింజ వరకు కొనుగోళ్లు ఉంటాయని ప్రభుత్వం చెప్తున్నదని, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరస్థితి కనిపించడం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎదురవుతున్న సమస్యలను గురువారం కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉన్నది. గత నెలలో వరి కొనుగోళ్లు ప్రారంభించారు. దాదాపు 45 రోజులు గడుస్తున్నా ఇంకా మందకొడిగానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 44వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో కొనుగోళ్లు చాలా వేగంగా జరిగాయి. అప్పట్లో కరీంనగర్ జిల్లాలో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు రైతుల వద్ద మద్దతు ధర కంటే రూ.400 తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అన్నదాతలు క్వింటాల్ ధాన్యంపై రూ.400 నష్టపోతున్నారు. ఇక సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు కూనారం సన్నాలు తీసుకోమని చెప్తున్నది. ప్రభుత్వ తీరు దళారులను ప్రోత్సహిస్తున్నట్టే ఉన్నది’ అని పేర్కొన్నారు. ఇప్పటికైనా కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్‌ను కోరినట్టు గంగుల తెలిపారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బుర్ర తిరుపతిగౌడ్, సంపత్‌రావు పాల్గొన్నారు.