జగిత్యాల రూరల్, అక్టోబర్ 28: ‘మా తమ్ముడు ఆపదల ఉన్నప్పుడు పోలీసోళ్లకు చెప్పినా పట్టించుకోలేదు. ఇవాళ మీ వెంట 60 మంది పోలీసోళ్లు ఏం జేయ వచ్చిన్రు? సచ్చిపోయిన నా తమ్ముడు ఇప్పుడు లేచి వస్తడా..’ అని మంత్రి శ్రీధర్‌బాబును సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మారు గంగారెడ్డి అక్క రాధ నిలదీశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్‌తో కలిసి సోమవారం రాత్రి ఆయన జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించగా, ఆమె ఇలా స్పందించారు. ‘మేమంతా ఓట్లు వేస్తేనే రేవంత్‌రెడ్డి సీఎం అయిండు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నా తమ్ముడు హత్యకు గురైండు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా తమ్మడి హత్యకు పోలీసోళ్ల వైఫల్యమే కారణం’ అంటూ ఆరోపించారు. అంతలోనే కుటుంబసభ్యులు కలుగజేసుకొని, ఆమెను మాట్లాడవద్దని సూచించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు గంగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. హత్య వెనుక రాజకీయ కారణం ఉన్నదా అని కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సందేహం వ్యక్తం చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డీజీపీ, ఎస్పీలతో మాట్లాడామని చెప్పారు.