హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : రైతులపై సీఎం రేవంత్‌రెడ్డిది నకిలీ ప్రేమే అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీకి 70సార్లు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయమున్నది కానీ, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల సమస్యలు తీర్చేందుకు తీరికే లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు బిడ్డను అని పోజులు కొట్టే రేవంత్‌రెడ్డి.. రైతుల గోడు పట్టించుకోవడమే లేదని మండిపడ్డారు. క్వింటా ధాన్యానికి ఏడు కిలోలకు పైగా తరుగు తీస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లోపించడం వల్లే రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.
ధాన్యంతోపాటు మక రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని గండ్ర వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలో మకలను కొనే నాథుడే లేడని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. ధాన్యం, మకల కొనుగోళ్లను వేగవంతం చేయాలని, లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.